ఇన్సురెన్స్ ప్రీమియంపై జీఎస్టీని తగ్గించాలి: ఎస్బీఐ రిపోర్ట్
బీమా పాలసీల ప్రీమియం చెల్లింపులపై జీఎస్టీ విధించడంపై ఎస్బీఐ ఎకోరాప్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం వీటిపై 18 శాతం జీఎస్టీని విధిస్తున్నారు. దీనిని పూర్తిగా రద్దు చేయాలని కోరింది. లేదంటే కనీసం అయిదు శాతం జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సూచించింది.
దేశంలో వీలైనంత మంది ప్రజలను బీమా రక్షణ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు ఈ చర్య అత్యంత అవసరమని పేర్కొంది. దీనికి తోడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిధిలోని కూలీలనూ ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY) పరిధిలోకి తీసుకురావాలని సూచించింది.

ఆరోగ్య బీమా అవసరంతో పాటు తగిన మొత్తానికి జీవిత బీమా రక్షణ ఉండాలనే అవగాహన ప్రజల్లోకి వచ్చిందని ఈ నివేదిక పేర్కొంది. కొత్త పాలసీలు తీసుకోవడంతో పాటు క్లెయిమ్స్ చెల్లింపులు అధికంగా ఉన్న సంస్థలకు తమ పాలసీలను మార్చుకోవడానికి పాలసీదారులు ప్రయత్నించారని పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య బీమా పాలసీల్లో 28.5 శాతం వృద్ధి కనిపించిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరిలో 25.9 శాతం వృద్ధి ఉందని వెల్లడించింది.