2022 తర్వాత జీఎస్టీ పరిహార సెస్: ఆప్షన్ 1కు ఆంధ్రప్రదేశ్ ఓకే, తిరస్కరించిన తెలంగాణ
GST పరిహారం కింద రూ.20వేల కోట్లను రాష్ట్రాలకు చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో సోమవారం భేటీ అయిన 42వ జీఎస్టీ మండలి సమావేశం ఎనిమిది గంటల పాటు సాగింది. జీఎస్టీ పరిహార బకాయిల కింద రాష్ట్రాలకు రూ.20వేల కోట్లు విడుదల చేస్తామని కేంద్రం ప్రకటించింది. 2017-18కి గాను ఐజీఎస్టీ వాటాని తక్కువగా అందుకున్న రాష్ట్రాలకు వచ్చే వారం రూ.24 వేల కోట్లు ఇస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు వసూలైన రూ.20 వేల కోట్లను రాష్ట్రాలకు పంపిణీ చేస్తామన్నారు. ఏప్రిల్-జూలై మధ్య రాష్ట్రాలకు పరిహారం రూ.1.51 లక్షల కోట్లుగా ఉందన్నారు. జీఎస్టీ వసూళ్ల తగ్గుదలను అధిగమించేందుకు గతంలో తాము సూచించిన 2 ఆప్షన్లలో ఏదో ఒక దానిని 21 రాష్ట్రాలు ఎంచుకోగా, కొన్ని రాష్ట్రాలు దేనినీ ఎంచుకోలేదన్నారు.
కొత్త రికార్డ్, TCS రూ.10లక్షల కోట్ల మార్కెట్ క్యాప్: ఇన్వెస్టర్ల సంపద రూ.69వేల కోట్లు జూమ్

2022 తర్వాత కూడా.. అందరికీ పరిహారం
జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలు తీసుకునే రుణాలు ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా చూస్తామని నిర్మల తెలిపారు. అసలు, వడ్డీని రాష్ట్రాలు తమ జేబుల నుండి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. కాబట్టి భారం ఉండదన్నారు. కరోనా సమయంలో జీఎస్టీ అమలుకు ఇబ్బందులు తలెత్తాయని, ఈ కారణంగా ఏర్పడిన నష్టాన్ని రాష్ట్రాలు వెంటనే భర్తీ చేసుకునేలా తక్షణ రుణం తీసుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించి వడ్డీ, అసలు అంతా సెస్ ద్వారా చెల్లిస్తామన్నారు. కరోనా కారణంగా ఏర్పడిన నష్టాన్ని అయిదేళ్ల తర్వాత సెస్ ద్వారా నేరుగా రాష్ట్రాలకు చెల్లిస్తామన్నారు. అందుకు సెస్‌ను 2022 తర్వాత కూడా అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. జీఎస్టీతో పాటు కరోనా కారణంగా ఏర్పడిన నష్టాల్ని రాష్ట్రాలకు కచ్చితంగా చెల్లిస్తామని, ఏ రాష్ట్రానికి పరిహారం తిరస్కరించడం లేదన్నారు. ఆప్షన్ ఎంచుకోని రాష్ట్రాలకు ఏమీ లభించదనే వార్తలు సరికాదని తెలిపారు. పరిహారం అందరికీ ఉంటుందన్నారు.

ఆప్షన్ 1 పరిహారం రూ.1.10 లక్షలకు పెంపు
ఆప్షన్ 1 కింద ఆదాయ క్షీణతను గతంలో రూ.97వేల కోట్లుగా అంచనా వేయగా, రూ.1.10 లక్షల కోట్లుగా అంచనా వేయాలన్న రాష్ట్రాల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించింది. ఈ ఆప్షన్ కింద తీసుకున్న రుణాలపై వడ్డీని అయిదేళ్ల తర్వాత వసూలు చేసే సెస్ ద్వారా చెల్లించాలని నిర్ణయించింది కేంద్రం. ఈ ఆప్షన్ 1కి ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, గుజరాత్, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, కర్నాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, పుదుచ్చేరి, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖడ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు అంగీకరించాయి.
ఇక, కేంద్రం ఇచ్చిన రెండు ఆప్షన్లలో దేనినీ ఎంచుకోని రాష్ట్రాల్లో తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కేరళ, రాజస్థాన్ ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాలకు ఎంత?
జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు రూ.20వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2017-18కి సంబంధించి ఐజీఎస్టీ రాని రాష్ట్రాలకు పంచనుంది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి రూ.2,638 కోట్లు రానున్నాయి. ఇవి వారం రోజుల్లో రానున్నాయి. రివర్స్ అండ్ ల్యాప్స్ ఐజీఎస్టీ ఐటీసీ కింద రూ.1,000 కోట్లు వస్తోంది. దీనిపై ప్రకటన చేయాల్సి ఉంది.
ఏప్రిల్, మే నెలల్లో జీఎస్టీ వసూళ్లలో వచ్చిన నష్టానికి పరిహారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం రూ.680 కోట్లు విడుదల చేసింది.
కేంద్రం ప్రతిపాదించిన మొదటి ఆప్షన్‌ను 21 రాష్ట్రాలు అంగీకరించగా, మిగిలిన రాష్ట్రాలు తిరస్కరించాయి. చట్ట ప్రకారం పరిహారం చెల్లింపు బాధ్యత కేంద్రానిదేనని, కేంద్రమే రుణాలు తీసుకొని తమకు చెల్లించాలని తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. ప్రతిష్టంభన నేపథ్యంలో పరిష్కారం కోసం ఈ నెల 12న జీఎస్టీ కౌన్సిల్ మరోసారి సమావేశం కానుంది.