GST collections: జీఎస్టీ రూ.1.29 లక్షల కోట్లు, తెలుగు రాష్ట్రాల నుండి ఎంతంటే?
2021 డిసెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు 13 శాతం పెరిగి రూ.1.29 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2020 డిసెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు 1.15 లక్షల కోట్లుగా నమోదయింది. ఆర్థికశాఖ శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం డిసెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు అక్షరాలా రూ.1,29,780 కోట్లుగా నమోదయింది. అందులో సెంట్రల్ జీఎస్టీ వాటా రూ.22,578 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.28,658 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.69,155 కోట్లుగా ఉంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, పన్ను ఎగవేత నియంత్రణ చర్యలు, జీఎస్టీ వసూళ్లు పెరగడానికి దోహదపడ్డాయి.
అయితే 2021 నవంబర్ నెలలో వసూలైన రూ.1.31 లక్షల కోట్లతో పోలిస్తే డిసెంబర్ నెలలో కాస్త తగ్గాయి. వరుసగా ఆరు నెలలుగా జీఎస్టీ వసూళ్లు రూ.1 లక్ష కోట్లకు మించి నమోదవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్) సగటున జీఎస్టీ వసూళ్లు రూ.1.30 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు రెండు త్రైమాసికాల్లో సగటున రూ.1.10 లక్షల కోట్లు, రూ.1.15 లక్షల కోట్లుగా ఉంది. చివరి త్రైమాసికంలోను జీఎస్టీ వసూళ్లలో ఇదే ధోరణి ఉండవచ్చు.

తెలుగు రాష్ట్రాలకు...
గత ఏడాది డిసెంబర్ నెలలో తెలంగాణ నుండి రూ.3,760 కోట్ల జీఎస్టీ ఆదాయం సమకూరిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2020 డిసెంబర్ నెలతో పోలిస్తే 2021 డిసెంబర్లో తెలంగాణ నుండి జీఎస్టీ వసూళ్లు 6 శాతం పెరిగాయి.ఆంధ్రప్రదేశ్లో 2020 డిసెంబర్ నెలతో పోలిస్తే 2021 డిసెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రెండు శాతం పెరిగి రూ.2,532 కోట్లుగా నమోదయ్యాయి.గోవాలో జీఎస్టీ కలెక్షన్స్ ఏడాది ప్రాతిపదికన 73 శాతం పెరిగాయి. నవంబర్ నెలతో పోలిస్తే 14 శాతం పెరిగింది. జాతీయ జీఎస్టీ వసూళ్ల సగటు కంటే గోవా వసూళ్లు 13 శాతం ఎక్కువ.