శుభవార్త: ప్లాస్టిక్, సిమెంట్, స్టీల్ ధరలు తగ్గుతున్నాయ్!
ఇంటిని నిర్మించాలనుకునే వారికి గుడ్న్యూస్. ఉక్కు, సిమెంట్ ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉక్కు తయారీకి వినియోగించే కోకింగ్ కోల్, ఫెర్రోనికెల్, పీసీఐ, కోల్, కోక్, సెమీ కోక్ వంటి ముడి పదార్థాలపై కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో దేశీయంగా ఉక్కు తయారీ వ్యయం తగ్గి, ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు దేశీయ పరిశ్రమలకు ఇనుప ఖనిజం అందుబాటులో ఉండేలా చూసేందుకు, వీటి ఎగుమతిపై సుంకాన్ని 30 శాతం నుండి 50 శాతానికి పెంచారు.
ఐరన్ ఓర్ పెలెట్ల ఎగుమతిపై 45 శాతం, మరిన్ని స్టీల్ ఇంటర్మీడియరీస్ పైన 15 శాతాన్ని పెంచారు. ఇవి నేటి నుండి అమలులోకి వచ్చాయి. కోక్, సెమీ-కోక్ పైన దిగుమతి సుంకం 5 శాతం తగ్గించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం పీసీఐ కోల్, కుకింగ్ కోల్ పైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తొలగించగా, నాప్తా పైన 2.5 శాతం నుండి 1 శాతానికి తగ్గించారు.

ఇదిలా ఉండగా, ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో వినియోగించే ముడి పదార్థాల పైన దిగుమతి సుంకాన్ని తగ్గించారు. పాలిమర్స్ అప్ వినైల్ క్లోరైడ్ పైన 10 శాతం నుండి 7.5 శాతానికి తగ్గించారు.