జీఎస్టీ ఫ్రేమ్‌వర్క్‌లో మార్పులు, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌లో మార్పులు!
మూలధన లాభాలపై పన్ను విషయంలో కొన్ని సవరణలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ బుధవారం వెల్లడించారు. షేర్లు, డెట్, రియాల్టీపై మూలధన లాభాల పన్నును లెక్కించడానికి ప్రస్తుతం ఉన్న వివిధ రేట్లు, హోల్డింగ్ వ్యవధి వంటి వాటిని మరింత సరళీకరించే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం స్థిర, చరాస్తుల విక్రయం ద్వారా వచ్చే లాభాల పైన పన్ను విధిస్తారు. కార్లు, ఫర్నీచర్ వంటి కొన్ని చరాస్తులపై మాత్రమే పన్ను ఉండదు.
సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ అంశంపై స్పందించారు. ప్రస్తుతం ఉన్న క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ విధానం సంక్లిష్టంగా ఉందని తరుణ్ బజాజ్ అభిప్రాయపడ్డారు. అవకాశం ఉన్నప్పుడు సవరణలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రపంచ దేశాలు ఎలాంటి విధానాలను అవలంభిస్తున్నాయో అధ్యయనం చేయాలని సీఐఐకి విజ్ఞప్తి చేశారు.

జీఎస్టీకి సంబంధించి ఈ ఏడాది సవరణలు చేస్తుందని తరుణ్ బజాజ్ తెలిపారు. ఈక్విటీని తీసుకు రావడానికి కొన్ని ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను తగ్గించాల్సిన అవసరముందని ప్రభుత్వం గుర్తించిందన్నారు. కోల్ సెస్‌కు సంబంధించి స్పందిస్తూ ఆర్థికమంత్రిత్వ శాఖ మార్పులు చేయవలసి వస్తే అది తిరిగి జీఎస్టీ కౌన్సిల్‌కు వెళ్లవలసి ఉంటుందన్నారు. అధిక సామర్థ్యం కలిగిన ఇన్వర్టర్ ఏసీలపై 28 శాతం జీఎస్టీని తగ్గించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నానన్నారు.