PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ యాప్ ఆవిష్కరించిన కేంద్రమంత్రి
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం ప్రారంభించి ఏడాది గడిచింది. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పీఎం కిసాన్ మొబైల్ యాప్‌ను సోమవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. రైతులకు ఈ పథకాన్ని మరింత చేరువ చేసేందుకు దీనిని తీసుకు వచ్చారు. దీని ద్వారా ఖాతాలో నగదు జమ వివరాలు, పేరు, చిరునామా మార్పులతో పాటు హెల్ప్ లైన్ నెంబర్లు పొందవచ్చు.
ట్రంప్‌కు హామీపై మోడీ వెనుకడుగు! భారీ ఒప్పందాలకు ఇండియా నో?
పీఎం కిసాన్ స్కీం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయం కింద రూ.6,000 మోడీ ప్రభుత్వం అందిస్తోంది. రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో ఇస్తుంది. పీఎం కిసాన్ స్కీంను ఫిబ్రవరి 24, 2019న ఉత్తర ప్రదేశ్‌లో మోడీ ప్రభుత్వం ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఈ స్కీంలో చేరలేదు.

ఈ స్కీం కింద 9.74 కోట్ల మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారు. కేంద్రం 14 కోట్ల రైతులను లక్ష్యంగా పెట్టుకుంది. అధికారిక డేటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన వివరాల ప్రకారం 8.45 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ నిధులు జమ అయ్యాయి. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం పని చేస్తోందని, ఇందులో భాగంగా పీఎం కిసాన్ స్కీంను తీసుకు వచ్చిందని కేంద్రమంత్రి తోమర్ అన్నారు.
ఈ పథకానికి 2019-20 బడ్జెట్లో రూ.75,000 కోట్లు కేటాయించారు. రైతులకు ఇచ్చింది రూ.42,044 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోపు రూ.54 కోట్లకు పైగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో రూ.20వేల కోట్లు మిగలవచ్చు. సంతృప్తకరస్థాయిలో ఈ పథకం కింద ప్రయోజనం అందుకుంటున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ 22, తెలంగాణ 23వ స్థానంలో ఉంది.