Gold Prices Today: భారీగా తగ్గి, పెరిగిన బంగారం ధరలు
బంగారం, వెండి ధరలు గతవారం భారీగా పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఓ సమయంలో రూ.50,000 దిగువకు, అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో 1810 డాలర్ల దిగువకు పడిపోయిన గోల్డ్ ఫ్యూచర్స్ ఆ తర్వాత ఎగిసిపడ్డాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రెండు నెలల క్రితం రూ.55,500 క్రాస్ చేశాయి. యుద్ధ ప్రభావం తగ్గిన తర్వాత రూ.50,000 స్థాయికి వచ్చాయి. ఇటీవల ద్రవ్యోల్భణ ఆందోళనలు, ఫెడ్ వడ్డీ రేటు పెంపు వంటి అంశాలు ప్రభావం చూపాయి. దీంతో పసిడి పైపైకి చేరుకుంటుంది. అయినప్పటికీ నాలుగు నెలల కనిష్టం వద్ద ఉన్నాయి.
ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో రూ.301 పెరిగి రూ.50,845 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.283 పెరిగి రూ.51,050 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.143 తగ్గి రూ.61,421 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.154 తగ్గి రూ.62,075 వద్ద ముగిశాయి. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో బంగారం ధర ఇటీవల రూ.6300 తక్కువగా పలికింది. ప్రస్తుతం రూ.5400 మేర తక్కువగా ఉంది. అంటే గతవారం కనిష్టం రూ.50,000 దిగువ నుండి రూ.50,845కు చేరుకోవడంతో దాదాపు రూ.1000 పెరిగింది.

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో 3.90 డాలర్లు పెరిగి 1845 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.43 డాలర్లు క్షీణించి 21.765 డాలర్ల వద్ద ముగిసింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లతో పోలిస్తే 230 డాలర్ల మేర తక్కువగా ఉంది.