రెండో రోజు తగ్గిన బంగారం ధరలు.. రూ.50,000కు చేరువలో
బంగారం ధరలు వరుసగా రెండో రోజు క్షీణించాయి. నిన్న భారీగా తగ్గిన ధరలు బుధవారం(అక్టోబర్ 29) ప్రారంభ సెషన్లోను తగ్గుముఖంపట్టాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ఉదయం గం.10.30 సమయానికి రూ.50కి పైగా (0.10 శాతం) తగ్గి రూ.50,452 పలికింది. ఓ సమయంలో రూ.50,405 వద్ద కనిష్టాన్ని తాకింది.
డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.452 క్షీణించి రూ.50,509 వద్ద, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.461 క్షీణించి రూ.50,595 వద్ద ముగిసింది. ఇక డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.2,082 క్షీణించి కిలో రూ.60,199 వద్ద, మార్చి ఫ్యూచర్స్ రూ.2,134 క్షీణించి రూ.61,773 వద్ద ముగిసింది.
పండుగ సీజన్లో 65% బంగారం వ్యాపారం, ధర కలిసి వస్తోంది..

స్వల్పంగా తగ్గిన బంగారం ధర
డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.50కి పైగా క్షీణించగా, ఫిబ్రవరి ఫ్యూచర్స్ దాదాపు స్థిరంగా ఉంది. రూ.50,595 వద్ద ట్రేడ్ అయింది. ఆగస్ట్ 7వ తేదీన గోల్డ్ ఫ్యూచర్స్ రూ.56,200తో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన విషయం తెలిసిందే. ఆ ధరతో పోలిస్తే పసిడి రూ.5700 తక్కువ పలికింది. ఎంసీఎక్స్‌లో మద్దతు ధర రూ.50250-50000, నిరోధకస్థాయి రూ.50780-51000 స్థాయిలో ఉంటుందని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

పెరిగిన వెండి ధర
నిన్న భారీగా తగ్గిన వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. డిసెంబర్ వెండి ఫ్యూచర్స్ రూ.116 (0.19 శాతం) పెరిగి రూ.60,254 వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో రూ.60,012 వద్ద కనిష్టాన్ని తాకి రూ.60వేల దిగువకు వచ్చే పరిస్థితి కనిపించింది. మార్చి ఫ్యూచర్స్ రూ.191(0.31 శాతం) పెరిగి రూ.61,948 పలికింది. రూ.61,974 వద్ద గరిష్టాన్ని తాకిన వెండి, రూ.61,790 వద్ద కనిష్టాన్ని తాకింది. నిన్న కిలో వెండి ధర రూ.2వేలకు పైగా తగ్గిన విషయం తెలిసిందే.

అంతర్జాతీయ మార్కెట్లో స్వల్ప పెరుగుదల
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా పెరిగింది. ఔన్స్ పసిడి 0.18 శాతం పెరిగి 1,882.55 వద్ద ట్రేడ్ అయింది. 1,875.85 - 1,883.65 మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో పసిడి 1879 డాలర్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది బంగారం 23.50 శాతం పెరిగింది.
వెండి ఔన్స్ 0.70 శాతం పెరిగి 23.523 డాలర్లు పలికింది. 23.295 - 23.562 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 23.359 వద్ద ముగిసింది. ఏడాదిలో వెండి 28.75 శాతం పడిపోయింది.