భారీగా పెరిగి, నేడు తగ్గిన బంగారం ధరలు, ఐనా రూ.51,000కు పైనే
బంగారం ధరలు క్రితం సెషన్లో మళ్లీ పెరిగాయి. గతవారం దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో రూ.50,000 దిగువకు వచ్చిన గోల్డ్ ఫ్యూచర్ ధరలు, ఇప్పుడు ఏకంగా రూ.51,000 మార్కును దాటాయి. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా రూ.62,000 క్రాస్ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1860 డాలర్ల పైకి చేరుకోవడం గమనార్హం. ఇటీవలి కనిష్టం 1810 డాలర్ల దిగువతో పోలిస్తే 60 డాలర్లకు పైగా పెరిగింది.
జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో రూ.258 పెరిగి రూ.51,165 వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ జూలై రూ.37 పెరిగి రూ.62,013 వద్ద ట్రేడ్ అయింది. నిన్నటి వరకు వరుసగా రెండు మూడు సెషన్లు పెరిగిన పసిడి ధరలు నేడు మాత్రం కాస్త తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ రూ.51,000కు పైనే ఉన్నాయి. ఉదయం గం.10 సమయానికి జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.92 తగ్గి రూ.51,065 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.80 క్షీణించి రూ.51,260 వద్ద ట్రేడ్ అయింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.23 తగ్గి రూ.61,953 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.62,698 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో ఈ వార్త రాసే సమయానికి గోల్డ్ ఫ్యూచర్స్ 4.33 డాలర్లు నష్టపోయి 1861 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.013 డాలర్లు తగ్గి 22.050 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1865 డాలర్లకు సమీపంలో ముగిసింది. నేడు మళ్లీ 1860 డాలర్ల స్థాయికి తగ్గింది. ప్రస్తుతం పసిడి ధరలు రెండు వారాల కనిష్టం వద్ద ఉన్నాయి.