5 నెలల్లో రూ.8500 తగ్గిన బంగారం, వెండి రూ.14,000 డౌన్: 2009 తర్వాత తొలిసారి...
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020 మార్చి నుండి ఆగస్ట్ 7 వరకు బంగారం ధరలు భారీగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఆరు నెలల క్రితం పసిడి పది గ్రాములు రూ.56,200 వద్ద గరిష్టాన్ని తాకింది. వెండి కూడా రూ.79,000ను తాకింది. అయితే అప్పటి నుండి పసిడి ధరలు అడపాదడపా పెరిగినప్పటికీ, మొత్తానికి తగ్గాయి. చివరి సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ 519.00 (-1.05%) తగ్గి రూ.48,702.00 వద్ద ముగిసింది. మొత్తంగా గత 5 నెలల కాలంలో బంగారం రూ.8400కు పైగా తగ్గింది. రూ.79,000 వరకు ఉన్న వెండి ఇదే కాలంలో రూ.14,400 తగ్గి రూ.65000.00 దిగువన ముగిసింది.
విలువలేదు: బిట్ కాయిన్, టెస్లా జంప్‌పై రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు

గత ఏడాది చివరలో డిమాండ్
ప్రపంచంలో బంగారం ఎక్కువగా వినియోగించే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ఏప్రిల్ నుండి బంగారం డిమాండ్ పడిపోయినప్పటికీ, 2020 చివరలో దసరా, దీపావళి పండుగ సీజన్‌కు తోడు, పెళ్లిళ్ల వంటి శుభకార్యాల వల్ల డిమాండ్ పెరిగింది. దీనికి తోడు క్రమంగా తగ్గడం కూడా కలిసి వచ్చింది. పండుగలు, శుభకార్యాల వల్ల బంగారానికి చివరలో డిమాండ్ పెరిగినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది.

కొనుగోలు డిమాండ్ డౌన్
2021లో బంగారం ధరలు కాస్త పుంజుకునే అవకాశాలు ఉన్నాయని, డిమాండ్ కూడా ఆశాజనకంగా ఉండవచ్చునని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం అన్నారు. 2009లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలోను పసిడి డిమాండ్ పడిపోయిన తర్వాత, మూడేళ్లలో డిమాండ్ పుంజుకున్నట్లుగా డేటా వెల్లడిస్తోందన్నారు. 2020లో ప్రధానంగా అధిక ధరలు కొనుగోలు డిమాండ్‌ను తగ్గించాయి.

బిట్ కాయిన్ ప్రభావం
గత ఏడాది 275.5 టన్నుల దిగుమతులు నమోదయ్యాయి. 2009 తర్వాత అత్యల్పం ఇదేనని డేటా వెల్లడిస్తోంది. కరోనా నేపథ్యంలో బంగారానికి డిమాండ్ పడిపోయినప్పటికీ, ఈ లోహంతో భారతీయులకు ఉన్న సాంస్కృతిక సంబంధం వల్ల కొంత డిమాండ్ కనిపించింది. అయితే ఇటీవలి కాలంలో బిట్ కాయిన్ పెద్ద ముప్పుగా కనిపిస్తోందంటున్నారు.