రూ.50,000 కిందకు దిగి వస్తుందా, ఈ వారంలో బంగారం ధరలు ఎలా ఉండొచ్చు?
ఈవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ రూ.50,500 స్థాయి కంటే కిందకు వస్తే మరింత క్షీణించే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రూ.50,00కు కిందకు రాకుంటే కాస్త సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. వెండి డిసెంబర్ కాంట్రాక్ట్ సాంకేతికంగా ప్రతికూల ధోరణిలో ఉండవచ్చు. రూ.71వేలకు పైకి వెళ్లకుండా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశముందని భావిస్తున్నారు.

ఆ మార్క్‌కు దిగి వస్తే..
ఆగస్ట్ 7వ తేదీన మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పసిడి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200కు చేరుకున్న అనంతరం, వరుసగా నాలుగు వారాలుగా ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ధరల పెరుగుదల, కరోనా మహమ్మారి నేపథ్యంలో బయటకు వెళ్లకపోవడం వంటి వివిధ కారణాలతో భౌతిక బంగారానికి డిమాండ్ తగ్గింది. దీంతో నిన్నటి వరకు రిటైల్ దుకాణాలు వెలవెలపోయాయి. గతవారం పసిడి ధరలు క్షీణించాయి. శుక్రవారంతో ముగిసిన వారానికి ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ.51,280 పలికింది. శుక్రవారం రూ.500 వరకు తగ్గింది. ఈ వారం రూ.50,500కు తగ్గితే మాత్రం మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే కామెక్స్‌లో చివరి సెషన్లో పసిడి ఔన్స్ ధర గరిష్టం 1954.78 డాలర్లు, కనిష్టం 1937.29 డాలర్లుగా ఉంది. చివరకు 1940 వద్ద ముగిసింది. ఇక, గత వారం గరిష్ట ధర 1966.54 డాలర్లు, కనిష్ట ధర 1906.62 డాలర్లు ఉండగా, గత నెలలో గరిష్ట ధర 2075.32 డాలర్లు, కనిష్ట ధర 1863.24 డాలర్లు పలికింది. ముడి సెప్టెంబర్ కాంట్రాక్ట్ ఈ వారం కాస్త సానుకూలంగా ఉండవచ్చునని చెబుతున్నారు.

ఈక్విటీ మార్కెట్..
కాగా, ఈ వారం ఈక్విటీ మార్కెట్లను వివిధ అంశాలు ప్రభావం చేయనున్నాయి. భారత్ - చైనా పరిణామాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. ఆగస్ట్ రిటైల్ గణాంకాలు, అమెరికా పెడ్ రిజర్వ్ వంటి అంశాలు ఈక్విటీ మార్కెట్‌ను నిర్దేశిస్తాయి. రిలయన్స్ రిటైల్‌లో వాటాల విక్రయం నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ వారం కూడా దూకుడుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, ఫార్మా షేర్ల కొనుగోళ్లకు మద్దతు లభించవచ్చునని భావిస్తున్నారు.