పెళ్లిళ్లు, జ్యువెల్లరీ డిమాండ్: దశాబ్దం గరిష్టానికి బంగారం దిగుమతులు
2021 క్యాలెండర్ ఏడాదిలో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. జ్యువెల్లరీ సేల్స్ రెండింతలు పెరగడంతో గత దశాబ్ద కాలంలోనే అత్యంత ఎక్కువ దిగుమతులు గత క్యాలెండర్ ఏడాదిలో నమోదయ్యాయి. డిమాండ్ మరింత కాలం ఇలాగే కనిపిస్తోందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. 2019లో ఆర్థిక మందగమనం, 2020లో కరోనా కారణంగా దిగుమతులు భారీగా పడిపోయాయి. అయితే 2021లో భారీగా పుంజుకున్నది. అంతకుముందు ఏడాది లేదా రెండేళ్లు మందగమనం, లాక్ డౌన్ వంటి వివిధ అంశాలు ప్రభావం చూపడంతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. 2021లో డిమాండ్ పుంజుకుంది. పెళ్లిళ్లు, సెలబ్రేషన్స్ పెరిగాయి. ముఖ్యంగా డిసెంబర్ వరకు మూడు నెలల పాటు డిమాండ్ భారీగా పుంజుకుంది.
2021లో భారత్ మొత్తం గోల్డ్ జ్యువెల్లరీ, కాయిన్స్, బార్స్ డిమాండ్ 79 శాతం పెరిగినట్లు వెల్లడించింది. 2020లో వినియోగం 446.4 టన్నులు కాగా, 2021లో 797.3 టన్నులకు చేరుకుంది. పూర్తి ఏడాది దిగుమతులు 925 టన్నులుగా పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఈ గోల్డ్ డిమాండ్ 10 శాతం పెరిగింది. 2011 తర్వాత తొలిసారి దిగుమతులు రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. 2022 క్యాలెండర్ ఏడాదిలో 800 నుండి 850 టన్నులుగా ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. అయిదేళ్ల సగటు 667 టన్నులుగా ఉంది.

మరోవైపు, బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.281 తగ్గి రూ.47,629, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.297 క్షీణించి రూ.47,685 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి 1785 డాలర్ల దిగువకు పడిపోయింది. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 11 డాలర్ల మేర తగ్గి 1782 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి రూ.442 తగ్గి రూ.61,502 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.496 తగ్గి రూ.62,216 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.333 డాలర్లు తగ్గి 22.351 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.