ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
న్యూఢిల్లీ: కరోనా కారణంగా వరుసగా రెండు త్రైమాసికాల్లో ప్రతికూల జీడీపీ నమోదు చేసి, సాంకేతికంగా మాంద్యంలోకి వెళ్లిన భారత్ ఇప్పుడు దాని నుండి బయటపడింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మూడో త్రైమాసికంలో సానుకూల వృద్ధిని నమోదు చేసింది. జూలై, ఆగస్ట్ నుండే ఆర్థిక రికవరీ కాస్త పుంజుకుంది. అక్టోబర్-డిసెంబర్ కాలంలో మరింత పుంజుకోవడంతో ఒకింత సానుకూల వృద్ధిని నమోదు చేసింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 0.4 శాతంగా నమోదయింది.
గుడ్న్యూస్, 30,000 మందికి క్యాప్జెమిని ఉద్యోగాలు! ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్కు అవకాశం

టెక్నికల్ రిసెషన్ ముగింపు
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో సానుకూల వృద్ధి నమోదు చేసిన అతికొద్ది ప్రధాన ఆర్థిక దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. V ఆకారపు రికవరీ ప్రారంభమైందని, ఇక వేగం అందుకోవడమే తరువాయి అని ప్రభుత్వం చెబుతోంది. శుక్రవారం జాతీయ గణాంక కార్యాలయం(NSO) విడుదల చేసిన గణాంకాల ప్రకారం... మూడో త్రైమాసికంలో 2020లో స్థూల దేశీయోత్పత్తి 0.4 శాతం మేర వృద్ధి చెందింది. 2019-20 ఇదే కాలంలో జీడీపీ వృద్ధి 3.3 శాతంగా ఉంది. కరోనా కారణంగా ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు మైనస్ 24.4 శాతంగా, రెండో త్రైమాసికంలో మైనస్ 7.3 శాతంగా నమోదయిన విషయం తెలిసిందే. మూడో త్రైమాసికంలో కాస్త సానుకూలంగా నమోదయింది.తాజా గణాంకాలతో దేశంలో టెక్నికల్ రిసెషన్ ముగిసిందని విశ్లేషకులు చెబుతున్నారు.

వ్యవసాయం, సేవలు, నిర్మాణం అదుర్స్
వ్యవసాయం, సేవలు, నిర్మాణ రంగాలు మంచి పనితీరు ప్రదర్శించడంతో మూడో త్రైమాసికంలో వృద్ధిని నమోదు చేశాయి. వ్యవసాయ రంగం 3.9 శాతం, తయారీ రంగం 1.6 శాతం వృద్ధిని నమోదు చేశాయి. నిర్మాణ రంగం 6.2 శాతం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవలు 7.3 శాతం ఎగిశాయి. కరోనా కారణంగా వాణిజ్యం, హోటళ్ల పరిశ్రమ మాత్రం 7.7 శాతం మేర క్షీణించాయి. జనవరి నెలలో కీలకమైన ఎనిమిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల వృద్ధి 0.1 శాతం ఎగిసింది.

తలసరి ఆదాయం అంచనా
2011-12 స్థిర ధరల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ రూ.36.22 లక్షల కోట్లకు చేరింది. 2019-20 ఇదే 3 నెలల కాలంలో నమోదైన రూ.36.08 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 0.4 శాతం అధికం. వాస్తవ లెక్కల ప్రకారం 2020-21లో జీడీపీ రూ.134.09 లక్షల కోట్లకు చేరుతుందని NSO అంచనా వేసింది. అంటే 2019-20తో పోలిస్తే 8 శాతం తక్కువ. తలసరి ఆదాయం రూ.85,929గా ఉండవచ్చునని అంచనా వేసింది. 2019-20లో నమోదైన రూ.94,566తో ఇది 9.1 శాతం తక్కువ.