క్రిప్టో కరెన్సీపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు, శ్రీలంకకు సహాయంపై...
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన అమెరికా పర్యటనలో ఓ సెమినార్లో క్రిప్టో కరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టోలను మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు నిధులు సమీకరించేందుకు ఉపయోగించే ముప్పు పొంచి ఉందన్నారు. క్రిప్టోలతో అన్ని దేశాలకు ఉన్న అతిపెద్ద ముప్పు ఇదేనని, మనీలాండరింగ్, ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందించేందుకు ఈ కరెన్సీని ఉపయోగించే అవకాశాలు ఉన్నాయన్నారు.
ఈ సమస్య పరిష్కరించేందుకు టెక్నాలజీతో కూడిన నియంత్రణ అవసరమని భావిస్తున్నామని చెప్పారు. ఇది కేవలం ఏ ఒక్క దేశమో నిర్వహించడం అసాధ్యమని, బోర్డులోని అన్ని దేశాలు సమన్వయం చేసుకోవాలన్నారు. భారత్లో టెక్నాలజీ వినియోగం గురించి కూడా కేంద్రమంత్రి ప్రస్తావించారు.

కరోనా సమయంలో భారత్లో టెక్నాలజీ వినియోగం భారీగా పెరిగిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రేటు 64 శాతంగా ఉందని తెలిపారు. భారత్లో మాత్రం టెక్నాలజీ వినియోగం 85 శాతానికి చేరుకుందన్నారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభం పైన కూడా ఆమె స్పందించారు. శ్రీలంకకు అన్ని విధాలుగా భారత్ నుండి సహకారం ఉంటుందని నిర్మలమ్మ చెప్పారు.