భారత వృద్ధిపై నిర్మలా సీతారామన్ ధీమా, సవాళ్లను తట్టుకునేలా..
వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 8 శాతం సాధ్యమయ్యే అంశమేనని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం అన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగుతుంటే, అంటే అన్ని రంగాలు క్రమంగా కోలుకుంటే వృద్ధి రేటు ముందుకు వెళ్తుందన్నారు. ఈ మేరకు ఆమె ఓ ఇంగ్లీష్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇప్పటికీ హాస్పిటాలిటీ, కాంటాక్ట్ ఇంటెన్సివ్ రంగాలకు ఆర్థిక మద్దతు అవసరమని అభిప్రాయపడ్డారు. అందుకే 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో వీటికి మద్దతిచ్చామన్నారు.
తనకు తెలిసినంతవరకు ప్రభుత్వం, బ్యాంకింగ్ వ్యవస్థలు, ఇతరుల మద్దతుతో ఆయా రంగాలు వారు కోరుకున్న మద్దతు లభిస్తే పునరుద్ధరణ వేగంగా ఉంటుందని నిర్మలమ్మ అభిప్రాయపడ్డారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8 శాతం నుండి 8.5 శాతంగా ఉండవచ్చునని ఆర్థిక సర్వే అంచనాల నేపథ్యంలో నిర్మలమ్మ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

రాబోయే ఆర్థిక సంవత్సరంలో భారత్ అనేక సవాళ్లను తట్టుకునే బలమైన స్థితిలో ఉందని నిర్మలమ్మ అన్నారు. 2022 బడ్జెట్లో ప్రకటించిన కాపెక్స్ బూస్ట్ ప్రయివేటు పెట్టుబడులను పెంచుతుందా అంటే ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్కరణలు క్రమంగా చేస్తున్నామని అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు 2019 లో కార్పోరేట్ పన్ను తగ్గింపును తీసుకు వచ్చామని, ప్రపంచవ్యాప్తంగా బహుశా అత్యల్పాల్లో ఒకటి అన్నారు. పరిశ్రమతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరుచూ సంప్రదింపులు జరిపారని, ఇది వారికి భరోసాను కల్పిస్తోందన్నారు. ప్రయివేటు పెట్టుబడులు వేగవంతమవుతాయని ధీమా వ్యక్తం చేశారు.