LIC IPO: జోరుగా ఏర్పాట్లు: ప్రైవేటీకరణలో తగ్గేదేలేదంటోన్న నిర్మలమ్మ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్.. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ విషయంలో మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం మొదలు కావడంతో- ఆర్థిక లక్ష్యాలను అందుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను మరింత వేగవంతం చేస్తోంది.

90 రోజుల్లో లక్ష కోట్లకుపైగా సమీకరణ..
2021-22 ఆర్థిక సంవత్సరం ఇంకో మూడు నెలల్లో ముగుస్తుంది. చివరి త్రైమాసికాన్ని అత్యంత కీలకంగా భావిస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోవడానికి మార్చి 31వ తేదీ వరకే గడువు ఉంది. ఆర్థిక లక్ష్యాలను అందుకోవడానికి అవసరమైన చర్యలను తీసుకోవడానికి 90 రోజుల గడువు మాత్రమే ఉండటంతో తన ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ చర్యలను మరిత ముమ్మరం చేసింది.

రెండు లక్షల కోట్లకు
ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం 1.75 లక్షల నుంచి రెండు లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమీకరించాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ స్వయంగా లోక్సభలో ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని కేంద్రం అందుకోలేకపోతోందనేది నిపుణుల అభిప్రాయం. ప్రైవేటీకరణ చర్యలు పెద్దగా ఫలితాలను ఇవ్వట్లేదు. అమ్మకానికి ఉంచిన ప్రభుత్వరంగ సంస్థలను టేకోవర్ చేసుకోవడానికి ప్రైవేటు పెట్టుబడిదారులెవరూ ముందుకు రావట్లేదు.

70 వేల కోట్ల కోసం..
ఒక్క ఎయిరిండియాను తప్ప మరో చెప్పుకోదగ్గ సంస్థలను విక్రయించలేకపోయింది. ఎయిరిండియాను ప్రైవేటీకరించడం వల్ల కేంద్రానికి వచ్చిన ఆదాయం 18,000 కోట్ల రూపాయలు మాత్రమే. అందుకే రెండు లక్షల కోట్ల రూపాయల లక్ష్యాన్ని అందుకోవడానికి ఎల్ఐసీ మీదే ఆశలను పెట్టుకుంది. ఎల్ఐసీని ప్రైవేటీకరించడంలో భాగంగా పబ్లిక్ ఇష్యూను జారీ చేసి.. కనీసం 70,000 నుంచి 80,000 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలని భావిస్తోంది.

ప్రయత్నాలు ముమ్మరం..
ఈ ప్రయత్నాల్లో భాగంగా నిర్మల సీతారామన్.. తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎల్ఐసీ ఐపీఓపై పూర్తిస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిమెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే ఇందులో పాల్గొన్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు అందజేయాల్సిన రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్పై కసరత్తు చేస్తోంది. ఈ ప్రాస్పెక్టస్కు సెబి అనుమతి లభిస్తేనే ఐపీఓను జారీ చేయడానికి వీలు ఉంటుంది.

రెగ్యులేటరీ అథారిటీ నుంచి..
దీనితోపాటు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటి మీద నిర్మల సీతారామన్ సమీక్ష నిర్వహించారు. అన్నీ సవ్యంగా సాగితే.. మార్చి మొదటి లేదా రెండో వారంలో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ జారీ చేసే అవకాశం ఉంది. దేశ చరిత్రలోనే అతి పెద్ద ఐపీఓగా దీన్ని తీసుకుని రావాలనేది నిర్మలా సీతారామన్ లక్ష్యం. దీనికి సంబంధించిన పలు కీలక విషయాలపై ఆమె చర్చించారు.

10 శాతం వాటా విక్రయానికి..
తొలిదశలో కేంద్ర ప్రభుత్వం అయిదు నుంచి 10 శాతం వరకు తన వాటాలను విక్రయించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎల్ఐసీలో వాటాల కొనుగోలుకు విదేశీ ఇన్వెస్టర్లను కూడా అనుమతించాలని ప్రభుత్వం యోచిస్తోంది. విదేశీ కంపెనీలకు అధిక వాటాలను విక్రయించాలనే ప్రచారం కూడా ఉంది. ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ నిర్వహణను చూసుకోవడానికి 10 మంది మర్చంట్ బ్యాంకర్లను నియమించింది.