Budget 2022: రంగంలో దిగిన నిర్మలమ్మ: హరీష్ రావు, బుగ్గన సహా
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో బడ్జెట్ 2022 (Budget 2022) కోలాహలం మొదలైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ముగింపుదశకు వచ్చింది. శుక్రవారం నాటితో ఈ థర్డ్ క్వార్టర్ ముగియనుంది. అత్యంత కీలకమైన నాలుగో త్రైమాసికం జనవరి 1వ తేదీ నుంచి ఆరంభం కాబోతోంది. ఏ ఆర్థిక సంవత్సరానికైనా ఫోర్త్ ఫైనాన్షియల్ క్వార్టర్ అనేది అత్యంత కీలకం. ఇంకో మూడు నెలల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. లక్ష్యాలను అందుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుంటుంది ఆర్థిక మంత్రిత్వ శాఖ. దీనితోపాటు బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పనపైనా దృష్టి సారించింది.

ప్రీ బడ్జెట్ భేటీ
2022 ఏప్రిల్ 1వ తేదీన కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లో కేటాయించాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలపై సంబంధిత మంత్రిత్వ శాఖ కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రీ బడ్జెట్ భేటీని నిర్వహించారు.
దేశ రాజధానిలోని విజ్ఞాన్ భవన్ వేదికగా కొద్దిసేపటి కిందటే ఈ సమావేశం ఆరంభమైంది. అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. హర్యానా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, భూపేష్ బఘేల్ కూడా హాజరయ్యారు.

రాష్ట్రాల అవసరాలపై..
రాష్ట్రాలకు కేటాయించాల్సిన నిధులు, మంజూరు చేసిన ప్రాజెక్టులకు చెల్లించాల్సిన బకాయిలు, ఆర్థిక అవసరాలకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చిస్తారు. స్మార్ట్ సిటీల పురోగతి, జాతీయ ప్రాజెక్టుల నిర్మాణం వంటి అంశాలు ఇందులో చర్చకు రానున్నాయి.
ఏయే రంగానికి ఎంత మేర బడ్జెట్‌ను కేటాయించాల్సి ఉంటుందనే విషయంపై ఇందులో చర్చ సాగుతుంది. ప్రధానంగా వస్త్ర పరిశ్రమ జీఎస్టీ శ్లాబ్‌ను పెంచడం పట్ల అన్ని రాష్ట్రాల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీన్ని నిర్మల సీతారామన్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

ఏపీ, తెలంగాణల నుంచి..
రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ (ఏపీ), తన్నీరు హరీష్ రావు (తెలంగాణ) ఈ భేటీలో పాల్గొన్నారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొంటారు. పోలవరం ప్రాజెక్టు నిధులు, జీఎస్టీ బకాయిలు, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన 4,000 కోట్ల రూపాయలు పైగా నిధులను మంజూరు చేయాలంటూ బుగ్గన రాజేంద్రనాథ్- నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది.

ఫిబ్రవరి 1న బడ్జెట్..
2022 ఫిబ్రవరి 1వ తేదీన నిర్మల సీతారామన్.. పార్లమెంట్లో బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా జనవరి చివరి వారంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఆరంభమౌతుంటాయి. అదే ఆనవాయితీని కేంద్ర ప్రభుత్వం పాటించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రీ బడ్జెట్ భేటీలో పాల్గొని తమ ఆర్థిక అవసరాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అన్ని రాష్ట్రాలు ప్రతిపాదనలను రూపొందించుకున్నాయి. వాటిని ఈ ప్రీ బడ్జెట్ భేటీ ద్వారా కేంద్రానికి సమర్పించనున్నాయి.