జుకర్‌బర్గ్ అసలు లక్ష్యం అదే.. ఇండియా తర్వాత గ్లోబల్ లక్ష్యం! జియోతో జట్టుతో వాట్సాప్ కొత్త సేవలు
మార్క్ జుకెర్బెర్గ్ రూటే సెపరేటు. ఆయన ఫేస్బుక్ ను స్థాపించిన నాటి నుంచి అది ఇప్పుడున్న స్థాయి కి ఎదిగేందుకు అనేక వ్యూహాలు అమలు చేస్తూ, ఎప్పటికప్పుడు టెక్నాలజీ లో మార్పులు చేస్తూ యూజర్‌కు దగ్గరవుతూ వచ్చారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మందికి పైగా ఫేస్బుక్ వినియోగదీస్తున్నారంటే అది మామూలు విషయం కాదు.
అయితే తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫారం పైనే కాకుండా... భవిష్యత్ లో తనకు పోటీ అవుతాయని భావించినా, లేదా వాటితో ప్రజలకు అధిక ప్రయోజనం ఉంటుందని అనిపించినా వెంటనే అలాంటి బిజినెస్ లను కొనుగోలు చేస్తూ తన వ్యూహాలను అమలు చేస్తూ ఉంటారు. ఇందుకు ఒక మంచి ఉదాహరణే వాట్సాప్ కొనుగోలు. సుమారు రూ 1.5 లక్షల కోట్లు వెచ్చించి వాట్సాప్ ను కొనుగోలు చేసినప్పుడు అందరూ ముక్కున వేలేసుకున్నారు.
కానీ, ఇప్పుడు ఆ ఫలాలను ఫేస్బుక్ అనుభవించటం చూసి ఔరా అని అంటున్నారు. తాజాగా ఇప్పుడు మార్క్ జుకెర్బెర్గ్ దృష్టి ఇండియా పై పడింది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలుస్తోంది. ముఖ్యంగా డిజిటల్ టెక్నాలజీ లకు భారత్ ఒక పెద్ద వేదిక మారుతోంది.
పొడిగింపే కాదు... పర్మనెంట్ అయ్యేలా ఉంది! వర్క్ ఫ్రమ్ హోమ్‌పై కంపెనీల మనోభావం

ఇక్కడ ప్రయోగం..
ఇండియా లో ఉన్న అపారమైన మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని మార్క్ జుకెర్బెర్గ్... రిలయన్స్ జియో లో భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టారు. 5.7 బిలియన్ డాలర్ల పెట్టుబడి తో జియో లో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా నిలిచారు. దీంతో ప్రస్తుతం జియో మార్ట్ ద్వారా ఈ కామర్స్ సేవలు అందిస్తున్న సమయంలో దానిని వాట్సాప్ తో అనుసంధానించి ఆ వేదికగానూ కామర్స్ జరిగేలా చూస్తున్నారు.
ప్రస్తుతం జియో మార్ట్ ముంబై మహానగరంలో వాట్సాప్ ఆధారిత ఆర్డర్ల ను తీసుకుంటోంది. త్వరలోనే మిగితా పెద్ద నగరాలకు కూడా ఈ సేవలను విస్తరించబోతోంది. ఒక వేళ ఈ ప్రయోగం విజయవంతం అయితే అప్పుడు దీనిని మిగితా కంపెనీలతో కూడా కలిసి చేపట్టేందుకు, అలాగే మిగితా దేశాల్లో అమలు చేసేందుకు వీలుపడుతుందని మార్క్ జుకెర్బెర్గ్ ఆలోచనగా ఉంది. అయన ఈ మేరకు అనలిస్ట్ కాల్ లో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది.

అమ్మకం... కొనుగోళ్లు...
వాట్సప్ ఎప్పటి నుంచో వాట్సాప్ బిజినెస్ అనే ఒక సరికొత్త మొబైల్ ఆప్ ను మార్కెట్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అమెరికా లో ప్రవేశపెట్టింది. ఇండియా లో కూడా అందుబాటులో ఉంది. ఇది చిన్న వ్యాపారులకు ఉద్దేశించిన మొబైల్ అప్. సొంత వెబ్సైటు లేనివారు దీని ఆధారంగా తమ ఉత్పత్తులను వినియోగదారులకు విక్రయించవచ్చు. పేమెంట్లు కూడా ఆన్లైన్ లో తీసుకోవచ్చు.
కానీ దానికి ఊహించినంత స్పందన రాలేదు. దీంతో ప్రస్తుతం జియో ప్లాట్ఫారం ద్వారా వినియోగదారులు, చిన్న వ్యాపారస్తులను ఒకే వేదికపై కి తీసుకొచ్చి అమ్మకాలు, కొనుగోళ్లు జరిగేలా చూడాలన్నది లక్ష్యం. దీనిని పేమెంట్ సేవలతో అనుసంధానించి ఒక పూర్తిస్థాయి మెసేజ్ ఆధారిత ఈ కామర్స్ ను ప్రోత్సహించాలని భావిస్తోంది. ఈ లక్ష్యానికి జియో మార్ట్ సరైన మార్గం అని భావించిన ఫేస్బుక్ అధినేత జుకెర్బెర్గ్... రిలయన్స్ జియో లో భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇక వాట్సాప్ కు తిరుగు ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇతర సంస్థలతో కూడా...
తొలుత కేవలం ఫేస్బుక్ తన వాట్సాప్ ప్లాట్ఫారం ను రిలయన్స్ జియో ప్లాట్ఫారం తో అనుసంధానించి ఇండియా లో ఈకామెర్స్ సేవలను విస్తృతం చేసుకుంటుంది. ఐతే ఇది కేవలం జియోతో ప్రత్యేక ఒప్పందంగా మాత్రం ఉండబోదు. ఈ ప్రయోగం విజయవంతం అయితే తమ కార్యకలాపాలకు మరింత ఉపయోగపడే పోటీ సంస్థలతో కూడా ఫేస్బుక్ చేతులు కలిపే అవకాశం లేకపోలేదు.
అంటే భవిష్యత్ లో మిగితా బడా ఈ కామర్స్ కంపెనీలతోనూ కలిసి పనిచేయవచ్చు. ఇదే విషయాన్ని జుకెర్బెర్గ్ కూడా అనలిస్టు కాల్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేస్బుక్ యూజర్లకు, వాట్సాప్ ద్వారా పూర్తిస్థాయి ఈ కామర్స్ సేవలు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు అమెజాన్ వంటి బడా సంస్థలకు చెక్ పెట్టేందుకు మార్గం సుగమం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో!