పెట్రోల్, డీజిల్ వాడకం భారీగా తగ్గినా.. ఆదాయం అదుర్స్: ఎందుకంటే
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో జీఎస్టీ వసూళ్లు తగ్గి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు పడిపోయాయి. అయితే పెట్రోల్, డీజిల్ ద్వారా వచ్చే ఆదాయం మాత్రం పెరిగింది. ఇందుకు ప్రధాన కారణం పెట్రోలియం ఉత్పత్తులపై విధించే ఎక్స్చైజ్ సుంకం. కరోనా కారణంగా అంతకుముందు ఏడాది కంటే అమ్మకాలు క్షీణించాయి. కానీ వసూళ్లు మాత్రం పెరగడం గమనార్హం. అమ్మకాలు తగ్గినప్పటికీ గత ఏడాది ఎక్సైజ్ సుంకం పెంచడంతో పెట్రోలియం ఉత్పత్తుల ఆదాయం పెరిగింది.
విలువలేదు: బిట్ కాయిన్, టెస్లా జంప్పై రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు

డీజిల్ అమ్మకాలు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2020 ఏప్రిల్-నవంబర్ మధ్య ఎక్సైజ్ సుంకం ద్వారా కేంద్రానికి రూ.1,96,342 కోట్ల మేర ఆదాయం వచ్చింది. అంతకు ముందు ఇదే కాలంలో రూ.1,32,899 కోట్లుగా ఉంది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ డేటా వెల్లడిస్తోంది. దేశంలో ఎక్కువగా వినియోగించే డీజిల్ వాడకం సుమారు 10 మిలియన్ టన్నులు తగ్గింది. కానీ ఆదాయం మాత్రం భారీగా పెరిగింది. 2019 ఏప్రిల్-నవంబర్ సమయంలో 55.4 మిలియన్ టన్నుల డీజిల్ అమ్మకాలు నమోదు కాగా, 2020లో ఇదే సమయంలో కేవలం 44.9 మిలియన్ టన్నుల డీజిల్ అమ్మకాలు నమోదయ్యాయి.

పెట్రోల్ అమ్మకాలు
పెట్రోల్ 2019లో 20.4 మిలియన్ టన్నులు సేల్ కాగా, 2020లో 17.4 మిలియన్ టన్నుల విక్రయాలు మాత్రమే జరిగాయి. ఈ మేరకు చమురు మంత్రిత్వ శాఖకు చెందిన ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (PPAC) డేటా వెల్లడిస్తోంది. ప్రభుత్వం గత ఏడాది లీటర్ పెట్రోల్ పైన రూ.13 ఎక్సైజ్ డ్యూటీని, డీజిల్ పైన రూ.16ను పెంచింది. ఈ మొత్తాన్ని మార్చి, మే నెలల్లో రెండు పర్యాయాల్లో పెంచింది. దీంతో పెట్రోల్ పైన ఎక్సైజ్ డ్యూటీ రూ.32.98కి, డీజిల్ పైన రూ.31.83కు పెరిగింది.

జీఎస్టీ నుండి మినహాయింపు
2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పెట్రోలియం, సహజవాయువు ఉత్పత్తుల్ని ఈ పన్ను విధానం నుంచి మినహాయించారు. వీటిపై విధించే ఎక్సైజ్ పన్ను ద్వారా కేంద్రానికి, వ్యాట్ ద్వారా రాష్ట్రాలకు ఆదాయం వస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు రెండు దశాబ్దాల కనిష్ఠానికి చేరడంతో గత ఏడాది కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని సవరించింది.