హైదరాబాద్‌లో మరిన్ని ఆ ఛార్జింగ్ స్టేషన్లు: ఆ 8 నగరాల్లోనూ
హైదరాబాద్: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే టూవీలర్ సెగ్మెంట్లో ఈవీ వెహికల్స్ హవా సాగుతోంది. పోటీ వాతావరణం పెరుగుతోంది. ఇదే పరిస్థితి కార్ల తయారీలో నెలకొంది. టాప్ కార్ మేకర్స్ అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి అధిక ప్రాధాన్యత ఇస్తోన్నాయి. కేంద్ర ప్రభుత్వం స్క్రాప్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చిన తరువాత ఈవీలకు డిమాండ్ భారీగా ఉంటోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా నాన్ పొల్యూటెడ్ వెహికల్స్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఈ పరిణామాల మధ్య- ఎలక్ట్రిక్ వాహనాలకు లభిస్తోన్న డిమాండ్‌కు అనుగుణంగా వాటి ఛార్జింగ్ స్టేషన్లను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. తొలిదశలో తొమ్మిది మెగా సిటీస్‌లల్లో ఇప్పుడు ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను రెట్టింపు చేసే దిశగా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ సహా బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై, సూరత్, పుణె, అహ్మదాబాద్, కోల్‌కతల్లో కొత్తగా మరిన్ని ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు కానున్నాయి.

ఆయా నగరాల్లో ఇప్పుడున్న ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను రెండున్నర రెట్లు పెంచబోతోన్నామని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్యకాలంలో ఈ తొమ్మిది నగరాల్లో 678 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పినట్లు వివరించింది. భవిష్యత్తులో అదనంగా 940 ఛార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేసింది. ఈ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ కిందటి నెల 14వ తేదీన రివైజ్డ్ గైడ్‌లైన్స్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే.
బీఈఈ, ఈఈఎస్ఎల్, పీజీసీఐఎల్, ఎన్టీపీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ కంపెనీలు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పడానికి ముందుకొస్తోన్నాయని, వాటికి అవసరమైన ప్రోత్సాహకాలను అందిస్తామని పేర్కొంది. చమురు సంస్థలు దేశవ్యాప్తంగా 22,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పడానికి ఇదివరకే అంగీకారాన్ని తెలిపాయి. జాతీయ రహదారుల వెంట వాటిని నెలకొల్పనున్నాయి. ఇందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటా అధికంగా ఉంది. 10,000 స్టేషన్లను ఐఓసీ ఏర్పాటు చేయనుంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్-7,000, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్-5,000 స్టేషన్లను నెలకొల్పనున్నాయి.