పెన్షనర్లకు శుభవార్త! కనీస పెన్షన్ రూ.9000కు పెంచుతారా?
ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు గుడ్ న్యూస్!! ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తల మేరకు ఉద్యోగుల కనీస నెలవారీ పెన్షన్ మొత్తాన్ని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మున్ముందు ఈ పెన్షన్ మొత్తాన్ని సబ్స్క్రైబర్లకు రూ.9000కు పెంచనుందని తెలుస్తోంది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ వచ్చే నెలలో జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. సమావేశంలో ఉద్యోగుల పెన్షన్ స్కీం(EPS) కింద పెన్షన్ను రూ.1000 నుండి రూ.9000కు పెంచే అజెండా ఉందని వార్తలు వస్తున్నాయి.
ఫిబ్రవరిలో జరగనున్న సమావేశంలో న్యూ-వేజ్ కోడ్, EPS కింద మినిమం పెన్షన్ స్కీం కీలక అంశాలుగా చెబుతున్నారు. మినిమం పెన్షన్ను రూ.1000 నుండి రూ.3000కు పెంచాలని మార్చి 2021లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ రికమండ్ చేసింది. అయితే కనీస పెన్షన్ రూ.9000కు పెంచితేనే ఈపీఎస్-95 పెన్షనర్లకు నిజమైన బెనిఫిట్ లభిస్తుందని భావిస్తున్నారు.

ఉద్యోగి లేదా కార్మికుడి చివరి నెల వేతనం ఆధారంగా పెన్షన్ను ఖరారు చేయాలనే సూచన కూడా వచ్చింది. ఈ సూచనతో పాటు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం కింద కొత్త వేతన కోడ్ అమలు తదితర ముఖ్య అంశాలపై కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈపీఎఫ్ఓ బోర్డు భేటీలో చర్చకు రావొచ్చునని తెలుస్తోంది.