వేతనజీవులకు చేదువార్త: PFపై వడ్డీ రేటు కోత?
వేతనజీవులకు చేదువార్త. ఈసారి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) వడ్డీ రేట్లు తగ్గించే అంశంపై పరిశీలిస్తోంది. 2019 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2020 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతానికి అంటే 15 బేసిస్ పాయింట్లు తగ్గించాలని ఈపీఎఫ్ఓ భావిస్తోంది.

వడ్డీ రేటు యథాతథంగా ఉండకపోవచ్చు
పెట్టుబడులపై లాభాలు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. దీర్ఘకాలిక ఫిక్స్డ్ డిపాజిట్స్, బాండ్స్, ప్రభుత్వ సెక్యూరిటీస్ పైన లాభాలు గత ఏడాది కాలంగా 50 నుంచి 80 బేసిస్ పాయింట్ల వరకు తగ్గడంతో ఈపీఎఫ్ఓ ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు యథాతథంగా ఉండకపోవచ్చు.

ఈ రెండు కంపెనీల్లో పెట్టుబడులు
దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఈపీఎఫ్ఓ రూ.4,500 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు ఈ సంస్థలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. ఈ రెండు సంస్థల దివాళా ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సొమ్ము ప్రస్తుతం రికవరీ అయ్యే అవకాశాలు లేవు.

మార్చి 5న సీబీటీ సమావేశం
మార్కెట్లలో EPFO మొత్తంగా రూ.18 లక్షల కోట్ల ఇన్వెస్ట్ చేసింది. వీటిలో 85% నిధులను డెట్ మార్కెట్లలో, మరో 15% నిధుల్ని ఈటీఎఫ్ ద్వారా ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టింది. దీంతో ఈక్విటీల్లో పెట్టిన పెట్టుబడులు గత ఏడాది మార్చి నాటికి 14.74% లాభాలతో రూ.74,324 కోట్లకు చేరాయి. కాగా, పీఎఫ్ వడ్డీ రేటు తగ్గింపు తుది నిర్ణయానికి ముందు గత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్వోకు వచ్చిన రాబడులపై ఎఫ్ఐఏసీ పరిశీలన చేసి, ఆ తర్వాత సీబీటీ పీఎఫ్ వడ్డీరేటు సమీక్షపై చర్చిస్తుంది. సీబీటీ సమావేశం మార్చి 5న జరగనుంది.