జెఫ్ బెజోస్‌ను దాటేశాడు.. చరిత్రలో అత్యంత వేగంగా సంపద సృష్టించిన ఎలాన్ మస్క్
ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడిగా అవతరించారు. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‌ను దాటవేసి, ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన వ్యక్తిగా నిలిచారు. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ వెల్లడించింది. మస్క్ సంపద 188.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. టెస్లా షేర్లు రాణించడంతో అతని ఆదాయం భారీగా పెరిగింది. ఏడాది కాలంగా ఆ షేర్లు జంప్ చేస్తున్నాయి. తాజాగా గురువారం 4.8 శాతం ఎగిసిపడటంతో మస్క్ ప్రపంచ కుబేరుడిగా నిలిచారు.
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు జంప్: కోలుకుంటున్న రియల్ ఎస్టేట్

మస్క్ సంపద 188.5 బిలియన్ డాలర్లు
అమెరికా సమయం ప్రకారం గురువారం ఉదయం పది గంటలకు ఎలాన్ మస్క్ నికర సంపద 188.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. భారత కరెన్సీలో ఇది రూ.14 లక్షల కోట్లకు పైగా. దీంతో 2017 నుండి అగ్రస్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ రెండో స్థానంలోకి వెళ్లారు. బెజోస్ సంపద కంటే మస్క్ ఆస్తి 1.5 బిలియన్ డాలర్లు ఎక్కువ. టెస్లా షేర్లు ఓ సమయంలో 7.4 శాతం కూడా ఎగిశాయి. ఆల్ టైమ్ గరిష్టం 811.61 డాలర్లను తాకింది.

ఆ రెండు తారుమారు
న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజీ షేర్ల ధరల ప్రకారం ప్రతి ట్రేడింగ్ రోజు ముగిసిన తర్వాత బిలియనీర్ల నికర సంపదను బ్లూమ్‌బర్గ్ ప్రకటిస్తుంది. బుధవారం ట్రేడింగ్ సమయానికి జెఫ్ బెజోస్ 184 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో 181 బిలియన్ డాలర్లతో మస్క్ రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత బిల్ గేట్స్ 132 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో, బెర్నార్డ్ అర్నాల్ట్ 114 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో, మార్క్ జుకర్‌బర్గ్ 99.9 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో, ఝాంగ్ షంషాన్ 93.4 బిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో, వారెన్ బఫెట్ 87.28 డాలర్లతో ఏడో స్థానంలో, లారీ ఫేజ్ 81.5 బిలియన్ డాలర్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. గురువారం ట్రేడింగ్ అనంతరం మస్క్ ముందుకు వచ్చి, బెజోస్ రెండో స్థానంలోకి వెళ్లారు.

ఏడాదిలో 150 బిలియన్ డాలర్లు
ఎలాన్ మస్క్ సంపద ఏఢాదిలో 150 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. చరిత్రలోనే అత్యంత వేగంగా సంపద సృష్టించిన రికార్డు మస్క్‌దే. టెస్లా షేర్లు ఏడాది క్రితంతో పోలిస్తే 740 శాతానికి పైగా ఎగిశాయి. ఎస్ అండ్ పీ 500 సూచీలో నమోదు కావడంతో గత ఏడాది చివరలో స్టాక్స్ రికార్డ్ స్థాయిలో పెరిగాయి. ఇక, గత ఏడాది టాప్ 500 కుబేరుల సంపద 1.8 ట్రిలియన్ డాలర్లు జమయింది. టాప్ 5 కుబేరుల వాటా ఇందులో 100 బిలియన్ డాలర్లు.