దీనికి ఎలాన్ మస్క్ మాత్రమే సరైన పరిష్కారం, పరాగ్‌కు థ్యాంక్స్: ట్విట్టర్ కో-ఫౌండర్
మైక్రోబ్లాగింగ్ ట్విట్టర్‌ను టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్ వశం చేసుకున్నారు. రెండు వారాల క్రితం ఈ సంస్థలో 9.2 శాతం వాటాలు కొనుగోలు చేసిన మస్క్ తాజాగా దీనిని 44 బిలియన్ డాలర్లకు పూర్తిగా సొంతం చేసుకున్నాడు. ఈ కొనుగోలుకు అవసరమైన నిధులను ఆయన బ్యాంకుల ద్వారా సమకూర్చుకుంటున్నారు. ట్విట్టర్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామని డీల్ ఖరారైన అనంతరం తన తొలి సందేశంలో మస్క్ పేర్కొన్నారు.

నన్ను విమర్శించినా ట్విట్టర్లో ఉంటారు
ప్రజాస్వామ్య పరిరక్షణకు వాక్ స్వాతంత్రం గట్టి పునాది అని, భవిష్యత్తులో మానవాళికి కావాల్సిన కీలక అంశాలపై చర్చించేందుకు ట్విట్టర్ ఓ డిజిటల్ వేదిక అని, కొత్త ఫీచర్ల ద్వారా ట్విట్టర్‌ను గతంలో ఎన్నడు లేనంత ఉన్నతంగా తీర్చిదిద్దుతామని ఎలాన్ మస్క్ వెల్లడించారు. అల్గారిథంను ఓపెన్ సోర్స్‌లో ఉంచి విశ్వసనీయతను పెంచుతామని, ట్విట్టర్‌కు ఉన్న పూర్తిస్థాయి సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు కంపెనీ, యూజర్లతో కలిసి పని చేయడానికి వేచి చూస్తున్నామని తెలిపారు. తనను తీవ్రంగా విమర్శించిన వారు కూడా ట్విట్టర్లో కొనసాగుతారన్నారు. అదే వాక్ స్వాతంత్రం అన్నారు.

స్వాగతించిన డోర్సే
ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయడంపై ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, కంపెనీ మాజీ సీఈవో జాక్ డోర్సే స్పందించారు. కొనుగోలుకు పూర్తి మద్దతు ప్రకటించారు. సమస్యకు ఏకైక పరిష్కారం మస్క్ మాత్రమే అన్నారు. ట్విట్టర్‌ను ఆయన కొనుగోలు చేయడం సరైన ముందడుగు అన్నారు. ట్విట్టర్ అంటే నాకు చాలా ప్రేమ అని, కంపెనీగా ట్విట్టర్ ఎప్పుడు తనకు ఏకైక సమస్య కూడా అని, ప్రస్తుతం ఇది వాల్ స్ట్రీట్ యాజమాన్యం చేతుల్లో ఉందని, దాని నుండి బయటకు తీసుకు రావడం కంపెనీ భవిష్యత్తుకు సరైన ముందడుగు అన్నారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత దీనిని ప్రయివేటు సంస్థగానే ఉంచుతానని మస్క్ ప్రకటించారు. అంటే ఇది పబ్లిక్ అష్యూ లిస్టింగ్‌లోకి రాదు.

వారి లక్ష్యం ఇదే
ట్విట్టర్‌ను ఎవరైనా కొనుగోలు చేస్తారని, దానిని నడిపిస్తారనుకుంటే తాను నమ్మలేనని, ఇది ఒక కంపెనీలా కాకుండా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా అది ఉండాలని కోరుకుంటానని, అయితే ఒక సంస్థగా ట్విట్టర్ ఎదుర్కొంటున్న సమస్యలకు ఏకైక పరిష్కారం మస్క్ అని తాను నమ్ముతున్నానని చెప్పారు. విశ్వసనీయత, సమ్మిళిత వేదికగా దీనిని మార్చాలనుకుంటున్న ఎలాన్ మస్క్ లక్ష్యం సరైనదేనని, ప్రస్తుత సీఈవో పరాగ్ అగర్వాల్ లక్ష్యం కూడా ఇదే అన్నారు. కంపెనీని అసాధ్య పరిస్థితి నుండి బయటపడేసిన మస్క్, పరాగ్‌కు థ్యాంక్స్ చెప్పారు.