గుడ్‌న్యూస్: వంటనూనెల ధరలు తగ్గుతున్నాయ్, ఎందుకంటే?
పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా తగ్గాయి. కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో లీటర్ పెట్రోల్, డీజిల్ పైన దాదాపు రూ.10 వరకు తగ్గింది. ఇది వాహన వినియోగదారులకు భారీ ఊరటను కలిగించింది. స్టీల్, సిమెంట్ ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే సమయంలో నూనె ధరలు భారీగా పెరిగి, వంటింట చెమటలు పట్టించాయి. అయితే ఈ తినదగిన నూనె ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణాలు పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం తొలగించడం, ఉక్రెయిన్ నుండి సన్‌ఫ్లవర్ రాక క్రమంగా పెరుగుతుండటం.
జూన్ నుండి వంట నూనెల ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా పామాయిల్‌ను ఎగుమతి చేసే దేశం ఇండోనేషియా. ఇటీవల తన ఎగుమతులపై నిషేధం విధించింది. కానీ ఇప్పుడు దానిని తొలగించింది. నిషేధం తొలగింపు మే 23వ తేదీ నుండి అమలులోకి వస్తుంది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ, ఉక్రెయిన్ నుండి సన్ ఫ్లవర్ ఆయిల్ సరఫరా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రతి సంవత్సరం ఇండోనేషియా నుండి 46 మిలియన్ టన్నుల పామాయిల్ ఉత్పత్తి ఉంటుంది. ఆహార అవసరాలకు 9 మిలియన్ టన్నులు, బయోడీజిల్ పథకానికి మరో 9 మిలియన్ టన్నులను వినియోగించుకోగా, మిగతా 28 మిలియన్ టన్నులను ఎగుమతి చేస్తోంది. ఏప్రిల్ 28వ తేదీ నుండి పామాయిల్ ఎగుమతులను నిషేధిస్తున్నట్లు ఇండోనేషియా ప్రకటించడంతో వంట నూనెల ధరలు పెరిగాయి. ఎగుమతులపై నిషేధాన్ని తొలగిస్తున్నట్లు ఇండోనేషియా 19న ప్రకటించగానే, మార్కెట్లో ధరలు 5 శాతం తగ్గాయి. 23న నిషేధం ముగియనున్న నేపథ్యంలో మరింత తగ్గే అవకాశముంది.