ఖర్చులపై ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలి, భారీ లోటు తప్పుతుంది
కరోనా నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థలో కొన్ని వెలుగులు, మరికొన్ని చీకట్లు కనిపిస్తున్నాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ప్రభుత్వం తన ఖర్చులను అప్రమత్తంగా చేయాలన్నారు. తద్వారా భారీ లోటు ఉండదన్నారు. వరుస కరోనా రకాల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. 2020 నుండి ప్రపంచంతో పాటు భారత్ తీవ్ర ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కొంటోంది. ప్రస్తుత K షేప్ ఆర్థిక పునరుద్ధరణను నిరోధించేందుకు ప్రభుత్వం మరింతగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

K షేప్ రికవరీ
సాధారణంగా K షేప్ రికవరీ అంటే చిన్న వ్యాపారాలు, పరిశ్రమల కంటే టెక్నాలజీ, పెద్ద సంస్థలు చాలా వేగంగా కోలుకునే పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ గురించి తన పెద్ద ఆందోళన మధ్య తరగతి, చిన్న మధ్య తరగతి రంగం పైన, చిన్నారుల పైన ప్రభావం ఉంటుందని చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థలో కొన్ని సానుకూల అంశాలు కనిపిస్తున్నప్పటికీ, చాలావరకు ఇబ్బందికర పరిణామాలు గోచరిస్తున్నాయన్నారు.

దెబ్బతిన్న వ్యాపారాలు
సాధారణంగా కే ఆకార రికవరీలో సాంకేతిక, అగ్రశ్రేణి సంస్థలు వేగంగా రికవరీ సాధిస్తున్నాయని, చిన్నస్థాయి వ్యాపారాలు, పరిశ్రమలు కరోనా ప్రభావంతో దారుణంగా దెబ్బతిన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్రారు. మధ్య తరగతి ప్రజలు, చిన్న, మధ్యస్థాయి రంగాలు, మన చిన్నారుల భవిష్యత్తు వీటి గురించే తనకు ఆందోళన అధికంగా ఉందని, వినియోగ వృద్ధి బలహీనంగా ఉందని, ప్రధానంగా ఎక్కువమంది ఉపయోగించే వస్తువులకు డిమాండ్ అంతగా పెరగలేదన్నారు.

బలమైన పునాదులు కానీ
ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సానుకూలతల విషయానికివస్తే అగ్రశ్రేణి సంస్థలు ఉన్నాయి. ఐటీ, ఐటీ ఆధారిత రంగాలు బాగా పని చేస్తున్నాయి. వేర్వేరు రంగాల్లో యూనికార్న్స్ పుట్టుకు వస్తున్నాయని చెప్పారు. ఆర్థిక రంగంలోని కొన్నిచోట్ల బలమైన పునాదులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఏయే రంగాలకు అవసరమో వాటి పైనే ఖర్చు చేయాలని, ముఖ్యంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంగాలను గట్టెక్కించే అంశంపై దృష్టి సారించాలన్నారు.