కండోమ్స్ బదులుగా హ్యాండ్ గ్లోవ్స్: కారెక్స్ పరిస్థితి ఇదీ
కౌలాలంపూర్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను మరోసారి అల్లకల్లోలానికి గురి చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార లావాదేవీలను తీవ్రంగా ప్రభావితం చేసింది. కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్ తరహా పరిస్థితులను విధించాల్సి రావడంతో అన్ని రంగాలు కుదేల్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయనుకునే దశలో మళ్లీ ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. కరోనా కేసులు భారీగా పెరగడానికి ఇదీ ఓ కారణమైంది.

నష్టాల్లో కండోమ్స్ కంపెనీలు..
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తోన్నాయి. ఆర్థికరంగాన్ని అతలాకుతలం చేస్తోన్నాయి. కార్పొరేట్ సెగ్మెంట్లో ఎవర్ గ్రీన్‌గా చెప్పుకొనే కంపెనీలు సైతం నష్టాల బారిన పడటం దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. కండోమ్ తయారీ కంపెనీలు సైతం నష్టాలబాట పడటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. లాక్‌డౌన్‌ను విధించిన సమయంలో ఒక్కసారిగా పెరిగిన వాటి అమ్మకాలు.. ఇప్పుడు ఢామ్మంటూ పడిపోయాయి.

సగానికి తగ్గిన అమ్మకాలు..
ప్రపంచంలోనే అతిపెద్ద కండోమ్ తయారీ కంపెనీ కారెక్స్ చేసిన తాజా ప్రకటన సంచలనంగా మారింది. తమ కండోమ్ అమ్మకాలు 40 శాతం వరకు పడిపోయాయని ప్రకటించిందా కంపెనీ మేనేజ్మెంట్. మలేషియాకు చెందిన కండోమ్ తయారీ కంపెనీ కారెక్స్. డ్యూరెక్స్ బ్రాండ్‌నేమ్‌తో ప్రపంచవ్యాప్తంగా కండోమ్స్‌ను ఎగుమతి చేస్తోంది. కండోమ్స్ మార్కెట్‌పై ఆధిపత్యాన్ని చలాయిస్తూ వస్తోంది. సెక్స్ చేసే సమయంలో వినియోగించే ప్రతి కండోమ్లో ఒకటి డ్యూరెక్స్దే.

17 శాతం వాటా కారెక్స్దే..
సెక్స్ కోరికలను పెంచే ఫ్రాగ్నెన్స్తో కండోమ్ తయారు చేయడం కారెక్స్ స్పెషాలిటి. ప్రతి సంవత్సరం 140 దేశాలకు కండోమ్స్‌ను ఎక్స్పోర్ట్ చేస్తుంటుంది. దీని వాల్యూమ్ 500 కోట్ల కండోమ్‌లకు పైమాటే. ప్రపంచవ్యాప్తంగా కండోమ్ మార్కెట్లో కారెక్స్ వాటా 17 శాతం. అలాంటి కంపెనీ ఇప్పుడు భారీగా నష్టాలను చవి చూస్తోంది కోవిడ్ పరిస్థితుల వల్ల. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తరువాత.. సెక్స్ వర్కర్ల దగ్గరకు వెళ్లడాన్ని తగ్గించుకున్నారని, ఫలితంగా కండోమ్స్ అమ్మకాలు తగ్గాయని అంచనా వేస్తోంది.

సెక్స్ వర్కర్ల వద్దకు వెళ్లాలంటే భయం..
మలేషియాలో సెక్స్ వర్క్‌కు చట్టబద్ధత ఉంది. కోవిడ్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత.. సెక్స్ వర్కర్లకు వెళ్లడాన్ని మలేషియన్లను తగ్గించుకున్నారని అభిప్రాయపడిందీ కంపెనీ యాజమాన్యం. కండోమ్‌తో సురక్షితంగా శృంగారంలో పాల్గొన్నా.. వారి ఎవరికి వైరస్ ఉందో తెలియని పరిస్థితులు నెలకొని ఉన్నాయని, ఈ భయం అటు సెక్స్ వర్కర్లు, వారి వద్దకు వెళ్లే విటుల్లోనూ ఉందని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. ఫలితంగా కండోమ్స్ అమ్మకాలు 40 శాతం వరకు తగ్గాయని పేర్కొంది.

60 శాతానికి తగ్గింపు..
హోటళ్లు మూతపడటం కూడా తమ వ్యాపారం తగ్గడానికి ఓ కారణమైందని కారెక్స్ తెలిపింది. లాక్డౌన్ వల్ల సప్లయ్ చైన్ దెబ్బతిన్నదని, దాని ప్రభావం వల్ల కూడా కండోమ్ మార్కెట్ క్షీణించిందని కారెక్స్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి గోహ్ మియా కెయిట్ తెలిపారు. ఈ మేరకు బిజినెస్ మ్యాగజైన్ నిక్కీ ఏసియన్ రివ్యూకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన కాంపిటీటివ్ కంపెనీ థాయ్ నిప్పాన్ రబ్బర్‌తో పోల్చుకుంటే అమ్మకాలు అధికమే అయినప్పటికీ.. 60 శాతానికి తమ ఉత్పత్తులను నియంత్రించుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

మార్కెట్ పుంజుకోవడం కష్టమే..
కరోనా వైరస్ భయం తొలగిపోయేంత వరకూ మార్కెట్ పుంజుకునే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నామని గోహ్ మియా కెయిట్ చెప్పుకొచ్చారు. ఆ భయాలు ఎప్పుడు తొలగిపోతాయనేది చెప్పలేమని వ్యాఖ్యానించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ.. సామాజిక పరిస్థితులు, భయాలు, ఇతరత్రా అనారోగ్య కారణాల వల్ల కండోమ్స్ అమ్మకాలు తగ్గాయని, మళ్లీ యధాతథ స్థితికి రావడానికి ఎంతకాలం పడుతుందోనని అన్నారు.

కండోమ్స్ గిరాకీ తగ్గడంతో..
కండోమ్స్‌కు గిరాకీ తగ్గడంతో కారెక్స్ కంపెనీ.. హ్యాండ్ గ్లోవ్స్‌ను తయారు చేసుకుంటోంది. కండోమ్స్ తయారీ కోసం వినియోగించే మెటీరియల్‌ను హ్యాండ్ గ్లోవ్స్‌ను తయారు చేయడానికి వినియోగించుకుంటోంది. ఇదివరకటి కంటే హ్యాండ్ గ్లోవ్స్‌కు డిమాండ్ భారీగా పెరిగిందని కారెక్స్ యాజమాన్యం చెబుతోంది. కండోమ్స్‌కు ప్రత్యామ్నాయంగా తాము గ్లోవ్స్ తయారు చేస్తోన్నామని, ఆ వాటా లోటును మాత్రం భర్తీ చేయలేమని గోహ్ మియా కెయిట్ వ్యాఖ్యానించారు.