కరోనాపై పోరుకు డిమార్ట్ అధినేత రూ.155 కోట్ల విరాళం: ఏపీ-తెలంగాణలకు రూ.10 కోట్లు
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కార్పోరేట్ అధిపతులు పెద్ద మొత్తంలో విరాళాలు అందిస్తున్నారు. డిమార్ట్స్ అధినేత రాధాకిషన్ ధమాని రూ.155 కోట్లు ఇచ్చారు. అదానీ గ్రూప్ రూ.104 కోట్లు, సీకే బిర్లా గ్రూప్ రూ.35 కోట్లు అందించింది. ఫ్రీడమ్ గ్రూప్ రూ.50 లక్షలు అందించింది. రూ.10 కోట్లతో యస్ బ్యాంక్ ఫండ్ రెయిజ్ చేయనుంది.
కరోనా దెబ్బ: నరేంద్ర మోడీ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ

డీమార్ట్ అధినేత రూ.155 కోట్లు
రిటైల్ సంస్థ డీమార్ట్ పేరుతో రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేసిన అవెన్యూ సూపర్‌మార్ట్స్ ప్రమోటర్ రాధాకృష్ణ దమానీ రూ.155 కోట్లు ప్రకటించారు. ఇందులో రూ.100 కోట్లు పీఎం కేర్స్ ఫండ్‌కు అందించారు. రూ.55 కోట్లను వ్యాపారాన్ని నిర్వహిస్తున్న 11 రాష్ట్ర ప్రభుత్వాలకు అందించారు. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ సంస్థలు తీసుకుంటున్న చర్యలకు చేదోడువాదోడుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ విరాళాన్ని అందించినట్లు కంపెనీ తన ప్రకటనలో తెలిపింది.

తెలంగాణ, ఏపీలకు రూ.5 కోట్ల చొప్పున
ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రూ.5 కోట్లు ఇచ్చింది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు రూ.10 కోట్ల చొప్పున అందించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, పంజాబ్‌లకు రూ.5 కోట్లు, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు రూ.2.5 కోట్ల చొప్పున ప్రకటించారు.

మరిన్ని కంపెనీలు..
పీఎం కేర్స్ నిధికి రూ.100 కోట్ల విరాళం ఇచ్చింది అదానీ గ్రూప్. గ్రూప్ సంస్థల ఉద్యోగులు కలిపి మరో రూ.4 కోట్లు ఇచ్చారు. సీకే బిర్లా గ్రూప్ రూ.35 కోట్లు విరాళం ప్రకటించింది. ఇందులో ప్రధాని సహాయ నిధికి రూ.25 కోట్లు, మిగతా రూ.10 కోట్లను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తుంది. ఎక్స్పర్సన్ డెవలపర్స్ రూ.1.85 కోట్లను, ఫ్రీడమ్ రూ.50 లక్షలు, సిగ్నిచర్ గ్లోబల్ రూ.2 లక్షలు పీఎం సహాయ నిధికి అందించింది. మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ పీఎం కేర్స్ ఫండ్స్‌కు రూ.3 కోట్లు ప్రకటించింది.