సంచలనానికి తెర తీసిన పేటీఎం: ఆ కీలక రంగంలో ఎంట్రీ: జాయింట్ వెంచర్ ఏర్పాటు
ముంబై: పీకల్లోతు నష్టాల్లో మునిగిన పోయిన డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ పేటీఎం సంచలనానికి తెర తీసింది. తన వ్యాపార కార్యకలాపాలను ఇతర రంగాలకు విస్తరించుకుంటోంది. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురవుతున్నప్పటికీ.. వెనక్కి తగ్గట్లేదీ ఫిన్‌టెక్ ఫర్మ్. వందల కోట్ల రూపాయల నష్టాలను చవి చూస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో సంచలనానికి తెర తీసింది. తాజాగా బీమా రంగంలోకి అడుగు పెట్టింది. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని నెలకొల్పనుంది.
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పేటీఎం భారీగా నష్టాలను చవి చూసిన విషయం తెలిసిందే. జనవరి-ఫిబ్రవరి-మార్చి కాలానికి పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్.. 763 కోట్ల రూపాయల మేర నికర నష్టాలు వచ్చినట్లు పేర్కొంది. అంతకుముందు- మూడో త్రైమాసికంలో 778.5 కోట్ల రూపాయల నష్టాన్ని చవి చూసింది. నాలుగో త్రైమాసికంలోనూ అవే నష్టాలను కొనసాగించింది. దీన్ని పూడ్చుకోవడానికి కంపెనీ యాజమాన్యం చేసిన ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించట్లేదనేది ఈ ఆర్థిక సంవత్సరం ఫలితాలు స్పష్టం చేస్తోన్నాయి.
ఈ పరిస్థితుల్లో కొత్తగా ఇన్సూరెన్స్ రంగంలో అడుగు పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పేటీఎం జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ పేరుతో కొత్తగా ఓ సంస్థను నెలకొల్పనుంది. జాయింట్ వెంచర్‌గా దీన్ని చేపట్టబోతోన్నట్లు పేటీఎం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేశారు. 10 సంవత్సరాల కాల వ్యవధిలో మొత్తంగా 950 కోట్ల రూపాయలను ఇందులో పెట్టుబడులు పెట్టడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏకగ్రీవంగా అంగీకరించారు.

పేటీఎం జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (పీజీఐఎల్)లో 49 శాతం వాటాలను- పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ కొనుగోలు చేస్తుంది. మిగిలిన 51 శాతం వాటాలను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ్ శేఖర్ శర్మకు చెందిన వీఎస్ఎస్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుంటుంది. అంతకుముందు ఈ పీజీఐఎల్‌లో పేటీఎం వాటా 74, వీఎస్ఎస్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాటా 26 శాతంగా ఉండేది.
దీన్ని 49కి కుదించుకుంది. మొదట రహేజా క్యూబీఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌తో జాయింట్ వెంచర్‌గా ఈ ఫర్మ్‌ను నెలకొల్పాలని భావించినప్పటికీ.. అది సాధ్యపడలేదు. రహేజా క్యూబీఈతో షేర్ల కొనుగోలు ఒప్పందాల్లో జాప్యం చోటు చేసుకుంది. దీనితో వీఎస్ఎస్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో పేటీఎం జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్‌ను నెలకొల్పడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంగీకారం తెలిపారు.