బిట్ కాయిన్ 2% జంప్, ఐనా 50,000 డాలర్లకు దిగువనే: కార్డానో 11% అప్
క్రిప్టో మార్కెట్ కాస్త పుంజుకుంటోంది. ఇటీవలి వరకు మేజర్ క్రిప్టోలు నష్టపోగా, చివరి సెషన్లో లాభాల్లోకి వచ్చాయి. అయినప్పటికీ క్రిప్టో కరెన్సీ మార్కెట్ వరుసగా నాలుగో వారం నష్టపోయింది. భారత్లో క్రిప్టో కరెన్సీ బిల్లు, అంతర్జాతీయంగా ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో బిట్ కాయిన్, ఎథేరియం సహా వివిధ క్రిప్టోలు వరుసగా నష్టపోయాయి. ఆ తర్వాత స్వల్పంగా లాభపడినప్పటికీ, ఆయా క్రిప్టో కరెన్సీలు ఆల్ టైమ్ గరిష్టానికి చాలా దూరంలో ఉన్నాయి.
క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ చివరి సెషన్లో 2.20 ట్రిలియన్ డాలర్ల నుండి 2.27 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. శనివారం రోజున ట్రేడింగ్ వ్యాల్యూమ్ 106.65 బిలియన్ డాలర్ల నుండి 78 బిలియన్ డాలర్లకు పడిపోయింది. క్రిప్టోల్లో ఎథేరియం, బిట్ కాయిన్ రెండు శాతం చొప్పున లాభపడ్డాయి. బిట్ కాయిన్ క్రితం సెషన్లో దాదాపు ఒక శాతం లాభపడి 49,820 డాలర్ల వద్ద ముగిసింది. ఈ వరల్డ్ పాపులర్ డిజిటల్ కరెన్సీ గత ఏడు సెషన్లలో 10 శాతం క్షీణించింది.

ఎథేరియం, పోల్కాడాట్, డోజీకాయిన్, షిబాఇను వంటి క్రిప్టోలు కూడా క్రితం సెషన్లో లాభపడ్డాయి. క్రితం సెషన్లో బిట్ కాయిన్ 1.89 శాతం, ఎథేరియం 1.28 శాతం, కార్డానో 10.73 శాతం, ఎక్స్ఆర్పీ 2 శాతం, డోజీకాయిన్ 0.95 శాతం లాభపడ్డాయి. టెథేర్ 0.91 శాతం, బియాన్స్ కాయిన్ 1.02 శాతం, పోల్కాడాట్ 1.76 శాతం నష్టపోయాయి.