Crypto Price Today: బిట్ కాయిన్ భారీ పతనం, టెర్రా 90% డౌన్
అమెరికా ఫెడ్ వడ్డీ రేటు పెంపుతో పాటు వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతుండటంతో పసిడి, క్రిప్టో మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ అయితే నేడు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. టెర్రా గత 24 గంటల్లో 60 శాతం నుండి 90 శాతం మధ్య పడిపోయింది. నిన్న లాభపడిన ఎథేరియం కూడా నేడు నష్టపోయింది. మేకర్ వంటి ఒకటి రెండు చిన్న క్రిప్టోలు మినహా అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి.
ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 31,000 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. 24 గంటల గరిష్టం 32,387 డాలర్లు, కనిష్టం 29,100 డాలర్లు. ఇరవై నాలుగు గంటల్లో 1.83 శాతం క్షీణించింది. ఓ సమయంలో 5 శాతానికి పైగా క్షీణించి 29,000 స్థాయికి పడిపోయింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ 597.50 బిలియన్ డాలర్లు తగ్గింది.

వివిధ క్రిప్టోల విషయానికి వస్తే బిట్ కాయిన్ 1.83 శాతం క్షీణించి 31,387 డాలర్ల వద్ద, ఎథేరియం 3.37 శాతం తగ్గి 2346 డాలర్ల వద్ద, ఎక్స్ఆర్పీ 10.43 శాతం క్షీణించి 0.471 డాలర్ల వద్ద, సోలానా 21.42 శాతం క్షీణించి 56.32 డాలర్ల వద్ద, క్రిప్టో డాట్ కామ్ 9.61 శాతం క్షీణించి 0.2144 డాలర్ల వద్ద, కార్డానో 9.96 శాతం క్షీణించి 0.6192 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. మీమ్ కాయిన్స్ డోజీకాయిన్ 15 శాతం పడిపోయి 0.96665 డాలర్లు, షిబా ఇను 18.37 శాతం తగ్గి 0.000014 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
నేటి టాప్ లూజర్స్ జాబితాలో టెర్రా ఉంది. గత ఇరవై నాలుగు గంటల్లోనే ఇది 90 శాతానికి పైగా క్షీణించింది. ఆ తర్వాత టెర్రా యూఎస్డీ 45 శాతం, గాలా 35 శాతం, డిస్ట్రిక్ట్ ఆక్స్ 33 శాతం, ఆరాగోన్ 30 శాతం, కావా డాట్ ఇన్ 30 శాతం, వేవ్స్ 30 శాతం, జాస్మీ కాయిన్ 28 శాతం, ఉమా ప్రోటోకాల్ 28 శాతం, అవాలాంచె 28 శాతం నష్టపోయాయి. టాప్ గెయినర్స్ జాబితాలో మేకర్ 21 శాతం మాత్రమే ఉంది.