క్రిప్టో కొనుగోలుదారులకు జీఎస్టీ షాక్! ప్రభుత్వానికి ఇండస్ట్రీ విజ్ఞప్తి
క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ చేయడం ద్వారా వచ్చే లాభాలపై చెల్లింపులకు సంబంధించి టీడీఎస్‌ను ప్రతిపాదిత 1 శాతం నుండి 0.01 శాతం లేదా 0.05 శాతానికి తగ్గించాలని భారత క్రిప్టో పరిశ్రమ కోరుతోంది. ఒక టీడీఎస్ రిటైల్ వ్యాపారులు ప్రయోజనాలకు విఘాతమని పేర్కొంది. క్రిప్టో ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను చాలా ఎక్కువ అని, ఈ పన్ను రేటును తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని కాయిన్ డీసీఎక్స్ సీఈవో, సహ వ్యవస్థాపకులు అన్నారు. కొత్త పన్ను నిబంధనలు, వాటి అమలు విషయంలో తన ప్లాట్‌ఫామ్‌లోని వ్యాపారులతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు.
క్రిప్టోపై మరింత పన్ను వడ్డించే దిశగా కేంద్రం యోచిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. క్యాసినో, బెట్టింగ్, లాటరీలతో పాటు క్రిప్టోపై 28 శాతం జీఎస్టీ విధించాలని జీఎస్టీ మండలి భావిస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు వచ్చే జీఎస్టీ మండలిలో ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే, క్రిప్టో మైనింగ్‌తో పాటు వాటి క్రయ, విక్రయాలపై 28 శాతం పన్ను చెల్లించవలసి ఉంటుంది.

దేశంలో క్రిప్టో పెట్టుబడులపై ప్రభుత్వం ఇప్పటికే వివిధ రకాల పన్నులు విధిస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ నుండి క్రిప్టోలు, నాన్ ఫంగిబుల్ టోకెన్స్(NFT) వంటి డిజిటల్ ఆస్తులలో పెట్టుబడులపై ఆర్జించే లాభాలపై 30 శాతం ఆదాయం పన్నుతో పాటు సెస్, 15 శాతం సర్‌చార్జీ చెల్లించవలసి ఉంటుంది. అంటే, ప్రభుత్వం క్రిప్టో లాభాలను సైతం గుర్రపు పందేలు, ఇతర గ్యాంబ్లింగ్ కార్యకలాపాల్లో ఆర్జించిన లాభాల్లాగే పరిగణించనుంది. అయితే క్రిప్టో లాభాలపై భారాన్ని తగ్గించాలని క్రిప్టో పరిశ్రమ కోరుతోంది.