ఒమిక్రాన్ దెబ్బకు విమానాలు విలవిల: వేల సంఖ్యలో సర్వీసులు రద్దు
ముంబై: రెండు సంవత్సరాలుగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు లాక్డౌన్లోకి వెళ్లాయి. లక్షలాదిమంది ఈ మహమ్మారికి బలి అయ్యారు. కోట్లమంది అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రుల పాలయ్యారు. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ కుదేల్ అయింది. అన్ని రంగాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ప్రత్యేకించి- పౌర విమానయాన రంగం కుప్పకూలింది. కోవిడ్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అన్ని దేశాలు విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి.

అమెరికాపై..
అగ్రరాజ్యంగా పేరున్న అమెరికా సైతం కరోనా వైరస్ ధాటికి కకావికలమైంది. కరోనా వల్ల అత్యధిక మరణాలు సంభవించింది అమెరికాలోనే. పాజిటివ్ కేసులు కూడా ఎక్కువగా నమోదైందీ ఇక్కడే. ప్రపంచవ్యాప్తంగా 54,11,321 కోట్ల మంది కరోనా వల్ల మరణించారు. 27,94,15,391 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఇందులో ఒక్క అమెరికాలోనే 8,37,671 మరణాలు నమోదయ్యాయి. 5,29,86,307 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.

రెండో స్థానంలో భారత్..
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో భారత్ ప్రపంచంలో రెండోస్థానంలో కొనసాగుతోంది. 3,47,79,815 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. 4,79,520 మంది కరోనా కాటుకు బలి అయ్యారు. లక్షలాది కుటుంబాలు తమ ఆప్తులను కోల్పోయిన చేదు కాలం అది. ఈ స్థాయిలో కల్లోల పరిస్థితులను మిగిల్చిన 2020, 2021 సంవత్సరాల్లో సంభవించిన పరిణామాలు వీలైనంత త్వరగా విస్మరించాలనే భావిస్తారు చాలామంది.

ఒమిక్రాన్ విజృంభణతో..
ఇప్పుడు మళ్లీ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతోండటం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. డిసెంబర్, జనవరి సమీపించే సమయానికి కొత్త వేరియంట్ విస్తృతం కావడంతో అనేక రాష్ట్రాలు మళ్లీ ఇంక్షల్లోకి వెళ్లాయి. నైట్ కర్ఫ్యూలను అమలు చేస్తోన్నాయి. కొత్త సంవత్సరం వేడుకలను రద్దు చేశాయి. ఇప్పటిదాకా 17 రాష్ట్రాల్లో 415 ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేేసులు నమోదయ్యాయి. అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి.

క్రిస్మస్ వీకెండ్లో 4,500లకు పైగా విమాన సర్వీసులు రద్దు
ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతుండటం వల్ల దాని ప్రభావం మొట్టమొదటిగా పడిందే విమాన సర్వీసులపై. అనేక దేశాలు తమ విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి. డొమెస్టిక్ సర్వీసులను మాత్రమే నడిపిస్తోన్నాయి. యూరప్‌లో ఉన్న అన్ని దేశాలు- దక్షిణాఫ్రికా సహా పలు ఆఫ్రికన్ కంట్రీస్‌తో విమాన సంబంధాలను తెంచుకున్నాయి. అయినప్పటికీ- ఒమిక్రాన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. క్రిస్మస్ వీకెండ్లో ప్రపంచవ్యాప్తంగా 4,500లకు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.

క్రిస్మస్ నాడే 2,000 ఫ్లైట్స్ క్యాన్సిల్
ఒక్క క్రిస్మస్ రోజు నాడే 2,000 విమాన సర్వీసులు రద్దయినట్లు ఫ్లైట్అవేర్ డాట్ కామ్ తెలిపింది. మరో 1,400 విమానాలు శుక్రవారం నాడు రద్దయ్యాయి. సిబ్బంది కొరత ఏర్పడటం వల్ల డెల్టా ఎయిర్‌లైన్స్ పలు డొమెస్టిక్ ఫ్లైట్ సర్వీసులను రద్దు చేసింది. మున్ముందు ఈ విమాన సర్వీసులు మరిన్ని రద్దయ్యే అవకాశాలు లేకపోలేదని ఫ్లైట్అవేర్ అంచనా వేసింది. కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.