GST on clothes: వస్త్రాల పై 5 నుంచి 12 శాతం వరకు జీఎస్టీ పెంపు
మనిషికి కనీసావసరాలైన కూడు, గూడు, గుడ్డ క్రమంగా ఖరీదవుతున్నాయి. కుటుంబ ఖర్చులు పెరుగుతున్నస్థాయిలో ఆర్థిక వనరులు పెరగకపోవడంతో అన్ని వర్గాల ప్రజలపై భారం పెరుగుతోంది. దీనికి ప్రభుత్వ నిర్ణయాలు కూడా ఓ కారణంగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వస్త్రాలపై జీఎస్టీని 5 శాతం నుండి 12 శాతానికి పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో వస్త్రాల ధరలు మరింత ప్రియం కానున్నాయి.
దీనిని జనవరి 1వ తేదీ నుండి అమల్లోకి తీసుకు వస్తుండటంతో ఈ సంక్రాంతికి దుస్తులు కొనుగోలు చేయాలంటే తడిసి మోపెడవుతుందనడంలో సందేహంలేదు. మధ్య తరగతి, సామాన్యుల పరిస్థితి ఇబ్బందికరంగా మారనుంది. జీఎస్టీ పెంపు కొనుగోలుపై ప్రభావం పడుతుందని వ్యాపార వర్గాలు ఆందోళన చేస్తున్నాయి.

ఏటా రూ.500 కోట్ల లావాదేవీలు
గుంటూరు జిల్లాలో ఏడు వేల వస్త్ర దుకాణాలు ఉండగా ఏటా రూ.500 కోట్ల వరకు వస్త్రాల కొనుగోలు లావాదేవీలు జరుగుతున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. వస్త్రాలను ఎక్కువగా అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, ముంబయి, కాంచీపురం, కోయంబత్తూరు తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి వ్యాపారులు విక్రయాలు కొనసాగిస్తున్నారు.

జిల్లా ప్రజలపై రూ.35 కోట్ల భారం
ఏటా జిల్లాలో వస్త్రాల కొనుగోలు, విక్రయాలకు సంబంధించి రూ.500 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతుండగా వస్తు సేవల పన్ను రూపేణా రూ.25 కోట్లు చెల్లిస్తున్నట్లు వ్యాపార వర్గాల గణాంకాలు చెబుతున్నాయి. 5 శాతం నుంచి 12 శాతానికి వస్తుసేవల పన్ను ఇటీవల కేంద్రం పెంచడంతో రూ. 60 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ లెక్కన జిల్లా వాసులపై రూ. 35 కోట్లు భారం పడనుంది. వస్తుసేవల పన్ను పెంపుపై ఇప్పటికే వ్యాపార వర్గాలు ఆందోళన బాటపట్టాయి.

భారం ఇలా..
అయిదుగురు సభ్యులు ఉన్న ఒక కుటుంబం దుస్తులు కొనుగోలుకు గతంలో రూ.10వేలు ఖర్చు పెడితే ప్రస్తుతం పెరుగుతున్న జీఎస్టీ ప్రకారం మరో రూ.1250 అదనంగా ఖర్చుచేయాల్సి ఉంటుంది. 5 శాతం పన్ను కింద వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రూ.750 చెల్లిస్తుండగా 12 శాతానికి పెంచటంతో మరింత చెల్లించాల్సి ఉందని వ్యాపారులు చెబుతున్నారు.