న్యూయార్క్ ఎక్స్ఛేంజ్కు దీదీ గుడ్‌బై: అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్
బీజింగ్: అగ్రరాజ్యం అమెరికా- డ్రాగన్ కంట్రీ చైనా మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ మొదటికొచ్చినట్టు కనిపిస్తోంది. ఇదివరకు- అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో మొదలైన ఈ ట్రేడ్ వార్ క్రమంగా ముదిరి పాకాన పడేలా ఉంది. అమెరికాలో తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోన్న స్వదేశీ కంపెనీలపై చైనా నిబంధనలను కఠినతరం చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఈ వాతావరణం మధ్య అమెరికాలో వ్యాపారాలను నిర్వహించడం అసాధ్యం కావడం వల్ల ఒక్కటొక్కటిగా చైనా కంపెనీలు అమెరికన్ మార్కెట్ నుంచి వెనక్కి మళ్లుతున్నాయి.
Shriram Properties IPO: ప్రైస్ బ్యాండ్, జీఎంపీ, లిస్టింగ్ సహా పూర్తి వివరాలివే..
టెక్ ఇండస్ట్రీస్, ఇ-కామర్స్, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌కు అమలు చేస్తోన్న నిబంధనలు, షరతులను చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. అమెరికా స్టాక్ ఎక్స్చేంజీల్లో నమోదైన కంపెనీల ఆడిటింగ్‌పై నిఘా ఉంచింది. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాల్సి ఉంటుందంటూ ఆదేశించింది. ఇదివరకు యాంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై విధించినట్లుగానే అమెరికన్ స్టాక్ మార్కెట్స్‌లో లిస్ట్ అయిన కంపెనీలపైనా నిఘా ఉంచడం వల్ల అక్కడ ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించుకోలేకపోతోన్నామనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.

తాజాగా- ఆన్లైన్ కార్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ దీదీ గ్లోబల్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఇదే నిర్ణయాన్ని తీసుకుంది. ప్రతిష్ఠాత్మక న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టింగ్ అయిన కంపెనీ ఇది. కమ్యూనిస్టు ప్రభుత్వం అమలు చేస్తోన్న నిబంధనల వల్ల న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నుంచి వైదొలగుతామని తెలిపింది. తమ షేర్లు, ఇతర లావాదేవీలన్నింటినీ హాంకాంగ్ మార్కెట్‌కు తరలిస్తామని పేర్కొంది. భద్రతాపరమైన కారణాల వల్ల విదేశాలకు విస్తరించిన కంపెనీలపై నిఘా ఉంచుతామని ఇదివరకే చైనా రెగ్యులేటర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, క్రాస్ బోర్డర్ డేటా వంటి అంశాలపై నిఘా పెంచింది కూడా.
కస్టమర్ డేటా ఫ్లో మీద చైనా రెగ్యులేటర్స్ దర్యాప్తునకు ఆదేశించాయి. దీనితో ఈ కంపెనీకి చెందిన షేర్లు న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో కుప్పకూలాయి. 25 శాతం మేర నష్టపోయాయి. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగిన ఆర్థికంగా మరింత నష్టపోవాల్సి వస్తుందనే భయం దీదీ గ్రూప్ కంపెనీ యాజమాన్యంలో వ్యక్తమౌతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి డీలిస్ట్ కావాలని నిర్ణయించుకున్నామని, హాంకాంగ్ మార్కెట్‌కు షిఫ్ట్ అవుతామని తెలిపింది. ఆఫ్ లిస్టింగ్‌కు సంబంధించిన పనులను మొదలుపెట్టనున్నట్లు స్పష్టం చేసింది దీదీ.