ట్రంప్‌కు భయపడినట్లే! చైనా ఆదేశాలు... అమెరికాలో టిక్‌టాక్ మూసివేత?
చైనా కంపెనీ బైట్‌డ్యాన్స్ అమెరికాలోని టిక్‌టాక్ ఆపరేషన్స్ క్లోజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి కంపెనీలు టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలతో పాటు ఇతరదేశాల కార్యకలాపాలను కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి. ఈ మేరకు చర్చలు సాగుతున్నాయి. అయితే టిక్‌టాక్ కొనుగోలు లేదా మూసివేతకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గడువు ఇచ్చారు. దీంతో పాటు ఇతర కారణాలతో అమెరికా కార్యకలాపాలను క్లోజ్ చేయడం మంచిదని చైనా భావిస్తోందని తెలుస్తోంది.
ఏం జరుగుతుందో చూద్దాం: టిక్‌టాక్‌పై తేల్చిచెప్పిన ట్రంప్

విక్రయం కాదు.. మూసివేయడం మంచిది.. చైనా ఆదేశం
షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాల హక్కులను విక్రయించేందుకు చైనా ససేమీరా అంటోంది. విక్రయం కంటే మూసివేయడం మంచిదని బైట్ డ్యాన్స్ భావిస్తున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. చైనా, బైట్ డ్యాన్స్‌కు ఇందుకు కారణాలు కూడా ఉన్నాయట. ట్రంప్ ఆదేశాలకు తలొగ్గి అమెరికా కార్యకలాపాలను అగ్రరాజ్య కంపెనీలకు విక్రయిస్తే తలొగ్గినట్లు, భయపడినట్లు అవుతుందని డ్రాగన్ దేశం భావిస్తోందట. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఏమాత్రం సరైనది కాదని భావిస్తోందని తెలుస్తోంది. కాబట్టి అమెరికా విధించిన గడువులోగా విక్రయించడం కంటే కార్యకలాపాలను క్లోజ్ చేయడమే మంచిదని చైనా... తమ దేశ కంపెనీ బైట్‌డ్యాన్స్‌కు స్పష్టం చేసిందట.

చైనా చేతిలో ఉన్నట్లు మరోసారి నిరూపితమైందా?
అమెరికా ఆదేశాలకు తలొగ్గి గడువులోగా అగ్రరాజ్యం కంపెనీలకు విక్రయించే బదులు క్లోజ్ చేయాలని బైట్ డ్యాన్స్‌కు చైనా చెప్పిందనే వార్తలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. బైట్ డ్యాన్స్ చైనా చేతిలోనే ఉందని చెప్పడంతో పాటు అమెరికా, భారత్ భద్రతాపరమైన ఆందోళనకు ఇది నిదర్శనం అనే వారు లేకపోలేదు. అయితే టిక్‌టాక్ కార్యకలాపాలు కొనసాగించే కంటే పూర్తిగా మూసివేయడం మంచిదని తమకు బీజింగ్ చెప్పలేదని బైట్ డ్యాన్స్ చెబుతోందట. తమకు చైనా నుండి ఎలాంటి సలహా లేదని స్పష్టం చేసింది.

ట్రంప్ ఆదేశాలు.. క్లియర్
టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాల కొనుగోలుకు మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి కంపెనీలు చర్చలు జరుపుతున్నాయి. టిక్‌టాక్ కూడా ఆసక్తి కనబరిచింది. భారత్‌లో టిక్‌టాక్ సహా పలు చైనీస్ యాప్స్ పైన నిషేధం ఉంది. మరోవైపు, టిక్‌టాక్‌కు తాము ఇచ్చిన గడువును పొడిగించేది లేదని, గడువులోగా అమ్మడమా... మూసివేయడమా వారే తేల్చుకోవాలని ట్రంప్ తాజాగా పునరుద్ఘాటించారు. తామిచ్చిన గడువులోగా ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయాలని ట్రంప్ సూటిగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో విక్రయిస్తే భయపడినట్లవుతుందని చైనా భావిస్తోందట.