దిగొస్తున్న వంటనూనె ధరలు: రాత్రికి రాత్రి కేంద్రం కీలక నోటిఫికేషన్ జారీ
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు నిన్న, మొన్నటిదాకా వాహనదారులను బెంబేలెత్తించాయి. పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 120 రూపాయలను సైతం దాటిన రాష్ట్రాలు ఉన్నాయి. ఎప్పుడూ లేనివిధంగా డీజిల్ సైతం 110 రూపాయల మార్క్‌ను దాటిన పరిస్థితులను చూశాం. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై అమలు చేస్తోన్న ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. పెట్రోల్‌పై ఎనిమిది, డీజిల్‌పై ఆరు రూపాయలను తగ్గించింది. ఫలితంగా ఈ రెండింటి ధరలు దిగొచ్చాయి.

వంటనూనెలపైనా
ఇప్పుడు తాజాగా- ఇలాంటి మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కాగుతున్న వంటనూనె ధరలను తగ్గించడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాత్రికి రాత్రి కీలక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సన్‌ఫ్లవర్, సోయాబీన్ నూనె దిగుమతులపై వసూలు చేస్తోన్న కస్టమ్స్ డ్యూటీ రద్దు చేసింది. అలాగే దీనిపై విధించిన అయిదు శాతం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్‌ను ఎత్తివేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం ఈ నోటిఫికేషన్ అమల్లో ఉంటుంది. 2024 మార్చి వరకు కూడా కస్టమ్స్ డ్యూటీ, అగ్రిసెస్ ఎత్తివేత అనేది కొనసాగుతుంది.

20 లక్షల మెట్రిక్ టన్నులకు వర్తింపు..
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సోయాబీన్, సన్‌ఫ్లవర్ క్రూడ్‌పై 20 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఈ కస్టమ్స్ డ్యూటీ, అగ్రిసెస్ ఎత్తివేతను వర్తింపజేసింది. వంటనూనెలను దిగుమతి చేసుకోవడంలో ప్రపంచలోనే అతిపెద్ద దేశం.. భారత్. నిత్యావసర సరుకుల ధరలు, వంటనూనె రేట్లు అమాంతంగా పెరిగిపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో- వాటిని నియంత్రించడంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ తాజా నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

ధరలు తగ్గముఖం..
ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ చర్యల వల్ల వంటనూనె ధరలు తగ్గుముఖం పడతాయని, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ విభాగం వెల్లడించింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. పామాయిల్ వంటి వంటనూనెల దిగుమతులపై వసూలు చేస్తోన్న సాధారణ పన్నులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. దిగుమతి లెవీని తొలగించింది. తాజాగా కస్టమ్స్ డ్యూటీ, అగ్రిసెస్‌ను తొలగించడం వల్ల సోయాబీన్, సన్‌ఫ్లవర్ వంటనూనెల ధరలు ఇక తగ్గుముఖం పట్టడం ఖాయం.

రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేలా..
నల్లసముద్రం ద్వారా వంటనూనెల తరలింపు సాధ్య పడకపోవడం కూడా దీనికి ఓ కారణమైంది. ఫలితంగా రవాణా ఖర్చు పెరిగిందనేది కేంద్ర ప్రభుత్వం చెబుతోన్న మాట. దాని తరువాత ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులపై తాత్కాలికంగా నిషేధాన్ని విధించింది ఫలితంగా వాటి రేట్లు పైపైకి ఎగబాకాయి. రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో - దాన్ని కొంతమేరకైనా తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.