GST returns filing: గుడ్‌న్యూస్: డెడ్‌లైన్‌కు ఒక్కరోజు ముందు కీలక పరిణామం
న్యూఢిల్లీ: ఇంకొక్క రోజు.. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఎన్నో తీపి, చేదు జ్ఞాపకాలను మిగిల్చిన 2021వ సంవత్సరం ముగుస్తుంది. కొత్త ఆశలతో 2022 ఆరంభమౌతుంది. దీనితో పాటు- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం కూడా పూర్తవుతుంది. శుక్రవారం నాటితో ఈ థర్డ్ క్వార్టర్ ముగియనుంది. అత్యంత కీలకమైన నాలుగో త్రైమాసికం జనవరి 1వ తేదీ నుంచి మనుగడలోకి వస్తుంది.

డెడ్‌లైన్..
ఏ ఆర్థిక సంవత్సరానికైనా ఫోర్త్ ఫైనాన్షియల్ క్వార్టర్ అనేది అత్యంత కీలకం. లక్ష్యాలను అందుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుంటుంది ఆర్థిక మంత్రిత్వ శాఖ. కాగా- గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) రిటర్నులను దాఖలు చేయడానికి డిసెంబర్ 31వ తేదీని తుది గడువును ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది గడువుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లోగా జీఎస్టీ పరిధిలోకి వచ్చే ట్యాక్స్పేయర్లందరూ తమ రిటర్నులను దాఖలు చేయాలని ఇదివరకే ఆదేశాలను జారీ చేసింది.

సీబీఐసీ నిర్ణయం..
తాజాగా ఈ గడువును పొడిగించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీఎస్టీ వార్షిక రిటర్న్స్‌లను దాఖలు చేయడానికి ఉద్దేశించిన గడువును 2022 ఫిబ్రవరి 28వ తేదీ వరకు పొడిగించినట్లు వెల్లడించింది. ఫామ్ జీఎస్టీఆర్-9, సెల్ఫ్-సర్టిపైడ్ రీకన్సాలియేషన్ స్టేట్మెంట్ ఫామ్ జీఎస్టీఆర్-9సీని దాఖలుకు నిర్దేశించిన గడువును డిసెంబర్ 31 నుంచి ఫిబ్రవరి 28వ తేదీకి పొడిగించామని పేర్కొంది.

జీఎస్టీ రిటర్నులు వీటికి తప్పనిసరి..
రెండు కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ ప్రతి వ్యాపార సంస్థ కూడా జీఎస్టీ రిటర్నులను దాఖలు చేయడాన్ని ఆర్థిక శాఖ తప్పనిసరి చేసింది. టర్నోవర్ అయిదు కోట్ల రూపాయలకు పైగా ఉన్న సంస్థలు జీఎస్టీ రీకన్సాలియేషన్ స్టేట్మెంట్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇదిలావుండగా.. 46వ జీఎస్టీ కౌన్సిల్ శుక్రవారం దేశ రాజధానిలో సమావేశం కానుంది. ప్రీ-బడ్జెట్ భేటీ ఇది. రేట్ రేషనలైజేషన్‌పై ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్.. తన నివేదిక అందజేస్తుంది.

రేపు జీఎస్టీ కౌన్సిల్..
దీనిపై జీఎస్టీ కౌన్సిల్ చర్చిస్తుంది. దీనికి సన్నాహకంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్.. ఇవ్వాళ అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రులతో భేటీ కానున్నారు. వర్చువల్ విధానంలో ఈ పమావేశం కొనసాగుతుంది. రాష్ట్రాలకు కావాల్సిన నిధులు, మంజూరు చేసిన ప్రాజెక్టులకు చెల్లించాల్సిన బకాయిలు, వారి ఆర్థిక అవసరాలకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చిస్తారు. ప్రధానంగా వస్త్ర పరిశ్రమ జీఎస్టీ శ్లాబ్‌ను పెంచడం పట్ల అన్ని రాష్ట్రాల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీన్ని నిర్మల సీతారామన్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

ఏపీ, తెలంగాణల నుంచి..
రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ (ఏపీ), తన్నీరు హరీష్ రావు (తెలంగాణ) వర్చువల్ విధానంలో ఈ భేటీలో పాల్గొంటారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొంటారు. పోలవరం ప్రాజెక్టు నిధులు, జీఎస్టీ బకాయిలు, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన 4,000 కోట్ల రూపాయలు పైగా నిధులను మంజూరు చేయాలంటూ బుగ్గన రాజేంద్రనాథ్- నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది.