Budget 2022: జనవరి 31వ తేదీన ఆల్ పార్టీ మీటింగ్
ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు జనవరి 31వ తేదీన ఆల్ పార్టీ మీటింగ్ ఉంది. ఈ మేరకు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 'పార్లమెంట్ బడ్జెట్ సెషన్లో ముఖ్యమైన అంశాలు, లెజిస్లేటివ్ బిజినెస్ వ్యవహారాలను చర్చించేందుకు లోకసభ/రాజ్యసభల పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశానికి ఆహ్వానించడం సంతోషంగా ఉంది' అని జోషి పేర్కొన్నారు.
ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీల సహకారాన్ని కోరుతున్నామని, అఖిల పక్ష సమావేశం జనవరి 31, 2022న మధ్యాహ్నం మూడు గంటలకు వర్చువల్ మోడ్లో నిర్వహించబడుతుందని, సమావేశానికి సంబంధించిన లింక్ నిర్ణీత సమయంలో మీకు పంపించబడుతుందని తెలిపారు. మీ భాగస్వామ్యం కోసం వేచి చూస్తున్నామని, సమావేశానికి హాజరు కావాలని కోరారు.

పార్లమెంటు బడ్జెట్ సెషన్ పార్ట్ 1 జనవరి 31వ తేదీన ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 11వ తేదీ వరకు కొనసాగుతుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ఫిబ్రవరి 1న లోకసభలో ప్రవేశ పెడుతున్నారు. ఇక బడ్జెట్ పార్ట్ 2 సెషన్ మార్చి 14వ తేదీన ప్రారంభమై, 8వ తేదీ ఏప్రిల్ నెలలో ముగుస్తుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రతి రోజు రెండు షిఫ్ట్లలో నిర్వహిస్తారు. ఉదయం గం.10 నుండి మధ్యాహ్నం గం.3 వరకు నిర్వహిస్తారు. బడ్జెట్ డే రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి తొమ్మిది గంటల వరకు కొనసాగే అవకాశముంది. బడ్జెట్ రోజున లోకసభ 11 గంటలకు ప్రారంభమవుతుంది.