ఆ టార్గెట్ చేరుకోవాలంటే ఇలా చేయాలి: నిర్మలకు మొబైల్ ఇండస్ట్రీ
వచ్చే బడ్జెట్లో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST)ని తగ్గించాలని ఇండస్ట్రీ బాడీ ఇండియా సెల్యూలార్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారాన్కు విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్మలమ్మ ఫిభ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాలు, పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలు పలు సూచనలు, విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ICEA జీఎస్టీ రేటును తగ్గించాలని కోరింది. కరోనా నేపథ్యంలో ఈ బడ్జెట్లో వివిధ రంగాలు, వర్గాలకు భారీ ఊరట ప్రకటనలు ఉంటాయని అంచనాలు ఉన్నాయి.

ఆ టార్గెట్ చేరుకోవాలంటే
మార్చి 2020లో జీఎస్టీని 50 శాతం పెంచడం మొబైల్ పరిశ్రమను దారుణంగా దెబ్బ తీసిందని ICEA ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ పెంపుకు సంబంధించి జీఎస్టీ కౌన్సిల్ సమర్పించిన హేతుబద్ధత లోపభూయిష్టంగా ఉందని తెలిపింది. జీఎస్టీ రేటును తగ్గించాలని కోరింది. ప్రతి భారతీయుడి చేతిలో స్మార్ట్ ఫోన్ లక్ష్యంగా ఉండాలంటే, అలాగే 80 బిలియన్ డాలర్ల మార్కెట్‌గా మొబైల్ పరిశ్రమ ఎదగాలంటే స్మార్ట్ ఫోన్ల పైన ఉన్న 18 శాతం జీఎస్టీని 12 శాతానికి తగ్గించాలని ICEA చైర్మన్ పంకజ్ మోహింద్రూ అన్నారు.

రూ.500 కోట్లు కేటాయించండి
ఎలక్ట్రానిక్స్ అభివృద్ధికి సంబంధించిన కీలక రంగాల కోసం వివిధ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయింపులు, మొబైల్ డిజైన్ సెంటర్‌కు రూ.200 కోట్ల బడ్జెట్ కేటాయింపులు అవసరమని ICEA సిఫార్సు చేసింది. ఇతర సిఫార్సుల్లో రూ.1000 కోట్ల వరకు రుణాల కోసం 5 శాతం వడ్డీని, రూ.100 కోట్ల వరకు రుణ హామీని కోరింది.

స్వదేశీ హ్యాండ్ సెట్స్
స్వదేశీ హ్యాండ్ సెట్ తయారీ గురించి స్పందిస్తూ, 200 డాలర్ల ఎంట్రీలెవల్ మొబైల్ ఫోన్ సెగ్మెంట్లో గ్లోబల్ లీడర్‌గా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా మద్దతు ఇస్తోందని తెలిపింది. ఇందుకు రూ.1000 కోట్లతో బడ్జెట్ కేటాయించాలని కోరింది. భారత ఛాంపియన్ కంపెనీలు బలమైన సరఫరా గొలుసును నిర్మిస్తాయని, ఈ పెట్టుబడి మన దేశానికి అసమాన డివిడెండ్ ఇస్తుందని అభిప్రాయపడింది.