Budget 2021: నిర్మలమ్మ ఆదాయ పన్నులో ఈ మార్పులు చేసేనా?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆమె ప్రవేశ పెట్టే బడ్జెట్ ఉద్యోగాలు సృష్టించే విధంగా, డిమాండ్ పెంచేందుకు ప్రజల చేతుల్లో మరింత డబ్బు ఉండేలా.. ఇలా ఎన్నో ప్రకటనలు ఉండే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక మందగమనం తర్వాత దెబ్బ మీద దెబ్బ అన్నట్లు కరోనా అంతకంటే ఎన్నో రెట్లు ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టింది. దీంతో నిర్మలమ్మ బడ్జెట్ పైన ఎన్నో రంగాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి.

ఆదాయపు పన్ను, స్టాండర్డ్ డిడక్షన్
ఇందులో ప్రధానంగా ఎప్పటిలాగే ఆదాయపు పన్నుకు సంబంధించి ఉద్యోగులు ఆశలు పెట్టుకుంటున్నారు. కరోనా కారణంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. లక్షలాది మందికి ఉద్యోగాల్లో కోత విధించబడింది. ఈ పరిస్థితుల్లో వీరి చేతుల్లో మరింత ద్రవ్యం ఉండేలా చర్యలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇండివిడ్యువల్స్కు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుత రూ.2.5 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచే ప్రకటన రావొచ్చునని భావిస్తున్నారు. అలాగే, హయ్యర్ స్టాండర్డ్ డిడక్షన్ ప్రస్తుతం ఉన్న రూ.50,000 నుండి రూ.75,000 లేదా రూ.1,00,000కు పెంచవచ్చునని భావిస్తున్నారు.

రెండు రకాల పన్నులకు బదులు
ప్రస్తుతం రెండు రకాల ఆదాయ పన్ను పద్ధతులు ఉన్నాయి. ఇందులో మొదటిది అన్ని మినహాయింపులు పొందుతూ పన్ను చెల్లించడం, రెండోది మినహాయింపులు ఏవీ లేకుండా ఆదాయానికి వర్తించే స్లాబ్స్ ప్రకారం పన్ను చెల్లించడం. ఈ రెండింట్లో ఏది ఎంచుకోవాలనే అంశంపై ఇప్పటికీ చాలామందిలో గందరగోళం నెలకొంది. వీటికి బదులు స్లాబ్స్ సవరించడం మంచిది అని భావిస్తున్నారు. రూ.5 లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను మినహాయింపు కల్పిస్తూ స్లాబ్స్ సవరిస్తే సరిపోతుందని అంటున్నారు.

80సీ ఉపశమనం
ఇటీవల ఏ బడ్జెట్లోను 80సీకి సవరణలు చేయలేదు. ఈ సెక్షన్ కింద ఈపీఎప్, లైఫ్ ఇన్సురెన్స్ ప్రీమియం, పిల్లల స్కూల్, ట్యూషన్ ఫీజులు, హోంలోన్ అసలు, ఈఎల్ఎస్ఎస్, పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్స్ వంటివి ఉంటాయి. వీటిపై రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ద్రవ్యోల్భణంతో పోలిస్తే ఈ మినహాయింపు మొత్తం ద్వారా వచ్చే ప్రయోజనం తక్కువే అంటున్నారు. కాబట్టి సెక్షన్ 80సీ కింద మినహాయింపు పరిమితిని పెంచవలసి ఉందని భావిస్తున్నారు. వీటిలో ఇన్సురెన్స్, హోంలోన్ అసలు మొత్తాలను అయినా మార్చాలని కోరుతున్నారు.

పెట్టుబడులపై..
దీర్ఘకాలిక పెట్టుబడులపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1 లక్షకు మించి ఆదాయం వస్తే ఆ పై మొత్తం మీద పది శాతం పన్ను ఉంటోంది. ఇది ఇన్వెస్టర్లకు చేదు గుళికగా మారింది. దీనిని ఎత్తివేయాలని లేదా పరిమితి పెంచాలని కోరుతున్నారు. ఈక్విటీలకు 12 నెలలు, డెట్ పథకాలకు మూడేళ్లుగా దీర్ఘకాలిక వ్యవధిని నిర్ణయించారు. స్థిరాస్తులకు ఇది 24 నెలలుగా ఉంది. దీనిని సవరించి డెట్ ఫండ్స్లోను రెండేళ్ల వ్యవధి ఉండాలని కోరుతున్నారు. స్వల్పకాలిక పెట్టుబడులపై పన్ను భారం 15 శాతాన్ని కొంత తగ్గిస్తే పెట్టుబడిదారులకు మరింత ప్రోత్సాహం ఉంటుందని అంటున్నారు.