Budget 2021: 10 ఏళ్లలో బడ్జెట్‌కు ముందు సూచీలు ఇలా, ఇన్వెస్టర్లకు హెచ్చరిక!
ముంబై: కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు మార్కెట్లు ఊగిసలాటలో ఉండటం సహజం. 2010 నుండి బడ్జెట్‌కు ముందు నెల రోజుల్లో సెన్సెక్స్ 7సార్లు నష్టపోగా, 3సార్లు లాభపడింది. ప్రతి ఏడాది బడ్జెట్‌కు ముందు నెల రోజులు మార్కెట్లు.. బడ్జెట్ వార్తలకు అనుగుణంగా కూడా కదులుతుంటాయి. 2019లో మందగమనం అనంతరం దెబ్బమీద దెబ్బ అన్నట్లు 2020లో కరోనా భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఈసారి నిర్మలమ్మ ప్రవేశ పెట్టే బడ్జెట్ పైన అందరి చూపు ఉంది.
దక్షిణాదిన రియాల్టీ అదుర్స్, హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు జంప్

ఈ సంవత్సరాల్లో సెన్సెక్స్ లాస్
బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి నెల రోజుల ముందు 2010, 2011, 2013, 2014, 2015, 2016, 2020లో సెన్సెక్స్ నష్టపోయింది. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. బడ్జెట్‌కు మరో పది రోజుల సమయం ఉంది. ఈ 20 రోజుల్లోనే సెన్సెక్స్ 2 శాతం వరకు ఎగిసింది. కరోనా నేపథ్యంలో 2020 మార్చి 23 నుండి మార్కెట్లు కుప్పకూలాయి. దశాబ్దాల కనిష్టాన్ని తాకిన సూచీలు, కార్యకలాపాలు క్రమంగా పుంజుకోవడంతో సూచీలు కూడా అంతకంతకూ పెరిగాయి. గత రెండు నెలల కాలంలోనే సెన్సెక్స్ 47 వేల నుండి 49వేల మార్కుకు చేరుకుంది.

2020లో ఇన్వెస్టర్లకు నిరాశ.. అంతలోనే సర్ప్రైజ్
కరోనా కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి. ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయారు. లాక్ డౌన్ సమయంలో పలువురు ఇన్వెస్టర్లు ఆందోళనతో షేర్లు అమ్ముకున్న వారు కూడా ఉన్నారు. అయితే ఆగస్ట్, సెప్టెంబర్ నుండి క్రమంగా కోలుకోవడం ప్రారంభించింది. ఇన్వెస్టర్లు ఆశ్చర్యపోయేలా భారీ నష్టాల నుండి లాభాల్లోకి వచ్చాయి. గత ఆరు నెలలుగా ఇన్వెస్టర్లు మంచి రిటర్న్స్ అందుకుంటున్నారు. అయితే సూచీలు దిద్దుబాటుకు గురయ్యే అవకాశం ఉంది.

ఇన్వెస్టర్లకు హెచ్చరిక
బడ్జెట్‌కు ముందు సెన్సెక్స్ 49,000 మార్కు దాటి ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 14,500 క్రాస్ చేసింది. 2020లోను బడ్జెట్‌కు ముందు సూచీలు సరికొత్త శిఖరాలను తాకాయి. అయితే ఆ తర్వాత పతనమయ్యాయి. ఈసారి 2020 మాదిరి పతనం కాకపోయినప్పటికీ, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.