17% వరకు పతనమైన టాప్ క్రిప్టోలు, బిట్ కాయిన్ 3 శాతం డౌన్
క్రిప్టో మార్కెట్ ఈ మధ్య భారీ ఊగిసలాటలో కనిపిస్తోంది. గత వారం నుండి పది సెషన్లుగా క్రిప్టో మార్కెట్ నష్టాల్లోనే కొనసాగుతోంది. అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ 30,000 డాలర్ల దిగువన, రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం 2000 డాలర్ల దిగువన ఉంది. గత ఇరవై నాలుగు గంటల్లో బిట్ కాయిన్, ఎథేరియం సహా పలు దిగ్గజ క్రిప్టోలు నష్టపోయాయి. మీమ్ కాయిన్స్ షిబా ఇను, డోజీకాయిన్ కూడా భారీగానే క్షీణించాయి. కీప్ నెట్ వర్క్, ప్యాక్స్ గోల్డ్, ట్రాన్ వంటి ఒకటి రెండు చిన్న క్రిప్టోలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి.
బిట్ కాయిన్ గత ఇరవై నాలుగు గంటల్లో 3.20 శాతం క్షీణించి 29,023 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. వారం క్రితం 29,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ, ఇప్పటికీ 30,000 డాలర్ల దిగువనే ఉంది. గత ఇరవై నాలుగు గంటల గరిష్టం 30,000 డాలర్లు, కనిష్టం 28,615 డాలర్లు. బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ 552.62 బిలియన్ డాలర్లు తగ్గింది.

మార్కెట్ క్యాప్ పరంగా చూస్తే బిట్ కాయిన్, ఎథేరియం, ఎక్స్ఆర్పీ, సోలానా, క్రిప్టో డాట్ కామ్, కార్డానో, స్టెల్లార్, అవాలాంచె, డోజీకాయిన్, షిబా ఇను, పోల్కాడాట్ 3 శాతం నుండి 17 శాతం మేర క్షీణించాయి. అవాలాంచె అన్నింటి కంటే ఎక్కువగా 17 శాతం తగ్గింది. కీప్ నెట్ వర్క్ 6 శాతం లాభపడింది. భారీగా నష్టపోయిన వాటిలో లూనా 34 శాతం, ఎక్స్వైవో నెట్ వర్క్ 18 శాతం, జాస్మీ కాయిన్ 17.62 శాతం, అవాలాంచె 17.32 శాతం క్షీణించింది.