ఉద్యోగుల్ని తొలగిస్తున్నాం: ఇండిగో చరిత్రలో తొలిసారి.. బాధాకర, కఠిన నిర్ణయం తప్పలేదు
కరోనా మహమ్మారి కారణంగా విమానయానరంగంపై భారీ ప్రభావం పడింది. ఈ వైరస్ కారణంగా ఇండియా బిగ్గెస్ట్ లో-కాస్ట్ ప్రయివేట్ ఎయిర్ లైన్స్ ఇండిగో తన ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీ ఈ ఆర్థిక ప్రభావాన్ని కంపెనీ తట్టుకుంటుందని భావించడం లేదని, వ్యాపార కార్యకలాపాలను కొనసాగించడానికి మరికొంత సమయం పడుతుందని, ఇలాంటి సమయంలో కొంత త్యాగం తప్పదని ఇండిగో సీఈవో రోనోజాయ్ దత్తా సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
280 ఔట్లెట్స్ క్లోజ్ చేసిన కేఫ్ కాఫీ డే, కారణాలివే: సేల్స్ ఎలా ఉన్నాయంటే

కంపెనీ చరిత్రలో తొలిసారి...
కంపెనీ చరిత్రలోనే తొలిసారి 10 శాతం ఉద్యోగులను తొలగించామని సీఈవో ప్రకటించారు. లేఆఫ్ ప్రభావం పడిన ఉద్యోగులకు స్థూల వేతనం ఆధారంగా నోటీస్ పే ఇస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగుల సర్వీసును బట్టి 3 నెలల నుండి 12 నెలల స్థూల వేతనం చెల్లిస్తామన్నారు. మార్చి 31, 2019 నాటికి కంపెనీలో 23,531 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో పదిశాతం ఉద్యోగులను తొలగిస్తున్నారు. తొలగించిన ఉద్యోగులకు ఆరోగ్య బీమాను డిసెంబర్ 2020 వరకు కొనసాగిస్తున్నట్లు సీఈవో తెలిపారు. అవసరమైతే ఆ తర్వాత కూడా కొనసాగిస్తామని వెల్లడించారు. సొంత ఊళ్ళకు వెళ్లాలనుకునే వారికి వన్-వే టిక్కెట్ ఇస్తామన్నారు.

బాధాకర నిర్ణయం తీసుకోక తప్పలేదు
ప్రస్తుత ఆర్థిక సంక్షోభంలో కొన్ని త్యాగాలు చేయకుండా సంస్థను ముందుకు తీసుకు వెళ్లడం సాధ్యం కాదని రోనోదత్తా పేర్కొన్నారు. కాబట్టి సాధ్యమయ్యే అంశాలను పరిశీలించిన తర్వాతనే ఉద్యోగుల్లో పది శాతం మందిని తొలగించాలని బాధాకరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అన్ని కోణాల్లో జాగ్రత్తగా అంచనా వేసి, సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం తమ ఎయిర్ లైన్స్ చరిత్రలో మొదటిసారి అన్నారు.

కరోనా దెబ్బ..
ప్రస్తుత పరిస్థితుల్లో 250 విమానాల్లో కొన్ని సర్వీసులు మాత్రమే నడుపుతోంది. 62 డొమెస్టిక్ డెస్టినేషన్స్, 24 ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్‌కు విమానాలు నడుపుతోంది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం సుదీర్ఘ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలు షట్ డౌన్ విధించడంతో గ్లోబల్ వ్యాప్తంగా విమానయానం ఇబ్బందుల్లో పడింది. దీంతో వివిధ దేశాల్లో వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోయారు. మన విమానయానంపై కూడా ఈ ప్రభావం పడింది. లాక్ డౌన్ నిబంధనల సడలింపుల నేపథ్యంలో దాదాపు 3 నెలల తర్వాత మే 25వ తేదీ నుండి కేవలం 50 శాతం నుండి 60 శాతం ఆక్యుపెన్సీ రేటుతో విమాన సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయినా డిమాండ్ అంతంత మాత్రంగా ఉండటంతో ఆదాయాలు క్షీణించాయి.