Bharat Bandh: నేడు, రేపు బ్యాంకింగ్ సహా వివిధ సేవలపై ప్రభావం
కేంద్రం విధానాలను వ్యతిరేకిస్తూ సెంట్రల్ ట్రేడ్ యూనియన్ నేడు, రేపు (సోమవారం, మంగళవారం) భారత్ బంద్కు పిలుపునిచ్చింది. మార్చి 28, 29 తేదీల్లో తలపెట్టిన ఈ బంద్కు ఇతర రంగాల కార్మిక సంఘాల మద్దతు కూడా ఉంది. బ్యాంకింగ్, బీమా, విద్యుత్ ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. బంద్ నేపథ్యంలో వివిధ సేవలపై ప్రభావం పడుతుంది. మార్చి 28, 29 తేదీల్లో తలపెట్టిన ఈ బంద్కు ఇతర కార్మిక సంఘాలు మద్దతిచ్చాయి. సోమ, మంగళవారం.. ఈ రెండు రోజుల పాటు పలు రంగాల సేవలపై ప్రభావం చూపుతోంది. దీంతో పలు విభాగాలు అత్యవసర సేవలకు సంబంధించి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు.
కార్మికులు, రైతులతో పాటు సామాన్య పౌరులకు వ్యతిరేకంగా ప్రభుత్వం విధానాలు ఉన్నాయంటూ సెంట్రల్ ట్రేడ్ యూనియన్ రెండు రోజుల బందుకు పిలుపునిచ్చింది. దాదాపు 20 కోట్ల మంది సంఘటిత, అసంఘటిత కార్మికులు ఈ బందులో పాల్గొంటున్నారు. కార్మిక సంఘాలు ఇచ్చిన ఈ బందుకు ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ మద్దతు పలికింది. బ్యాంకుల ప్రయివేటీకరణతో పాటు బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2021కి వ్యతిరేకంగా తమ నిరసన తెలియజేస్తున్నట్లు తెలిపారు. దీంతో నేడు, రేపు బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రభావం ఉంటుంది.

బంద్ కారణంగా రెండు రోజుల పాటు తమ బ్యాంకు సేవల్లో అంతరాయం కలగవచ్చునని ఎస్బీఐ, ఇతర బ్యాంకులు తమ కస్టమర్లకు సమాచారం ఇచ్చాయి. బ్యాంకులతో పాటు టెలికం, పోస్టల్, ఇన్కం ట్యాక్స్, ఇన్సురెన్స్ తదితర రంగాలకు చెందిన కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. బంద్ నేపథ్యంలో లెఫ్ట్ పార్టీ కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో రోడ్లను బ్లాక్ చేశారు. రైల్వే లైన్ల పైన నిరసన తెలిపారు.