బెంగళూరు, హైదరాబాద్‌లలో కాంట్రాక్ట్ ఉద్యోగాల జోరు, ఐటీ కంపెనీల్లో భారీ ఆఫర్లు: సర్వే
కరోనా మహమ్మారి నేపథ్యంలో కంపెనీలు, సంస్థల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చాలా కంపెనీలు కాంట్రాక్ట్ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ తరహా ఉద్యోగాలు పెరుగుతున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగాలకు బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో అధిక డిమాండ్ ఉంది. ఈ మేరకు కాంట్రాక్టువల్ జాబ్ మార్కెట్ కంపెనీ టెక్ ఫైండర్ సర్వేలో వెల్లడైంది.
కరోనా కారణంగా నియామక వ్యూహాల్లో వ్యవస్థాగత మార్పులు చోటు చేసుకున్నట్లు టెక్ ఫైండర్ సర్వే తెలిపింది. దీంతో కాంట్రాక్టు లేదా తాత్కాలిక ఉద్యోగ అవకాశాలు పుంజుకున్నట్లు వెల్లడించింది. కరోనా కాలంలో బెంగళూరు, హైదరాబాద్ భారతీయ సిలికాన్ వ్యాలీ కిరీటాన్ని నిలబెట్టుకున్నాయి.
హోమ్‌లోన్ తీసుకునే వారికి HDFC గుడ్‌న్యూస్: వడ్డీ రేట్ల కోత.. ఎంత, ఎప్పటి నుండి అంటే..

బెంగళూరు తర్వాత హైదరాబాద్
కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో హైదరాబాద్, బెంగళూరు ముందు నిలిచినట్లు టెక్ ఫైండర్ సర్వే తెలిపింది. జూలై-సెప్టెంబర్ కాలంలో దేశవ్యాప్తంగా 42,000 కంపెనీల్లో సర్వే నిర్వహించింది ఈ సంస్థ. ఈ సర్వేలో 65 శాతం మంది పురుషులు, 35 శాతం మంది మహళలు ఉన్నారు. కాంట్రాక్టు ఉద్యోగాల్లో బెంగళూరు సహా కర్ణాటక రాష్ట్ర వాటా 29 శాతంగా ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్, వరంగల్ సహా తెలంగాణ రాష్ట్ర వాటా 29 శాతంగా ఉందని తెలిపింది. ముంబై, పుణే, నాగపూర్ సహా మహారాష్ట్రలో 18శాతం, చెన్నై, కోయంబత్తూరు సహా తమిళనాడులో 15 శాతం, ఢిల్లీలో 14 శాతంగా ఉన్నట్లు తెలిపింది.

దేశవ్యాప్తంగా పెరుగుదల
దేశవ్యాప్తంగా క్రమంగా కాంట్రాక్టు ఉద్యోగాలు పెరుగుతున్నట్లు ఈ సర్వే తెలిపింది. చిన్న నగరాల్లోను పెరుగుతున్నట్లు తెలిపింది టైర్ 1 నగరాల్లో 58 శాతం డిమాండ్ ఉందని, అలాగే టైర్ 2, టైర్ 3 నగరాల్లో వరుసగా 32 శాతం, 10 శాతం డిమాండ్ ఉందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో కాంట్రాక్టువల్ ఉద్యోగాలు సానుకూల ప్రభావం చూపుతాయని తెలిపింది. ఉద్యోగులను 6 నెలల నుండి 12 నెలల కాలానికి తీసుకున్నట్లు టెక్ ఫైండర్ సర్వేలో తేలింది.

ఐటీపై ఆసక్తి
ఐటీ రంగంలో కాంట్రాక్టు పైన పనిచేసేందుకు ఎక్కువమంది ఆసక్తి కనబరుస్తున్నారు. సాఫ్టువేర్ డెవలపర్లు, ఇంజినీర్లు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్లు, డేటా అనలిస్టులు, సైంటిస్టులు, వెబ్ జావా డెవలపర్లు, ఫుల్ స్టాక్ డెవలపర్లుగా ఉద్యోగాల కోసం ఎక్కువ మంది ఆసక్తి చూపారు. మహిళలు తమ ఉద్యోగ కలను నెరవేర్చుకునేందుకు కాంట్రాక్టు ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. 22 ఏళ్ల నుండి 44 ఏళ్ల వయస్సు వారు కాంట్రాక్టు ఉద్యోగాలపై ఆసక్తి కనబరిచారు. ఐటీ, ఫార్మా, మార్కెటింగ్, టెలికం, బీమా రంగాలపై ఆసక్తితో ఉన్నారు. విదేశాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం 70 శాతం మంది ప్రయత్నించారు.