బడా కార్పోరేట్ దిగ్గజాల బ్యాంకింగ్ ఎంట్రీ: ఆర్బీఐ ఇంటర్నల్ గ్రూప్ నివేదికపై ఆసక్తికర చర్చ
ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ అందించిన నివేదికపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బడా కార్పొరేట్ సంస్థలకు ఆర్బీఐ పెద్ద ఆఫర్ ఇవ్వనున్నట్లు నివేదిక ఆధారంగా తెలుస్తోంది . బడా వ్యాపార వర్గాలకు విభిన్న బ్యాంకింగ్ లైసెన్సుల కోసం అనుమతులు ఇవ్వనున్నట్లు, ప్రైవేట్ రంగ బ్యాంకుల ఏర్పాటుకు ఆర్బిఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లుగా తాజా పరిణామాలతో అర్థమౌతుంది. అయితే పెద్ద పారిశ్రామికవర్గాలకు బ్యాంకింగ్ అనుమతులు ఇవ్వడం లాభమా నష్టమా అన్నది ఇప్పుడు వాణిజ్య వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది.

డిపాజిటర్ల నిధులు ఇతర వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే అవకాశం
బడా పారిశ్రామికవేత్తలకు భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో ఆధిపత్యం చెలాయించడానికి అవకాశం కల్పిస్తే వారు డిపాజిటర్లు డిపాజిట్ చేసిన నిధులను ఇతర వ్యాపారాలకు మళ్ళించే అవకాశం ఉన్నట్లుగా, డిపాజిటర్ల నిధులను కూడా సొంతానికి వాడుకునే అవకాశం ఉన్నట్లుగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు .ఈ నివేదిక చాలా కంపెనీలకు బ్యాక్ డోర్ తెరిచే మార్గాన్ని సుగమం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు చాలావరకు బ్యాంకింగ్ రంగంలో కాలు మోపడానికి ఆసక్తి చూపే అవకాశం ఉన్నందున కస్టమర్ల సేవల విషయంలో కూడా ఇబ్బంది కలిగే పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సు సంస్థలు పక్కా కమర్షియల్ ... అదే జరిగితే బ్యాంకింగ్ సేవలకు చుక్కలే
ఇప్పటికే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు కస్టమర్లను వీరబాదుడు బాదుతారు అనే పేరుంది. అలాంటి సమయంలో వీరు బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశిస్తే బ్యాంకింగ్ కూడా పక్కా కమర్షియల్ అవుతుందనే అభిప్రాయం ఉంది. ఇప్పటివరకు బ్యాంకింగ్ సేవా రంగంగా ఉంటే, ప్రైవేటు బడా సంస్థలు ప్రవేశిస్తే బ్యాంకింగ్ పూర్తిగా కమర్షియల్ గా మారుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో ప్రైవేట్ బ్యాంకులు చాలా వరకూ చట్టంలోని లొసుగులను ఆధారం చేసుకొని, డిపాజిటర్లను మోసం చేసి బోర్డు తిప్పేస్తున్న వేళ బ్యాంకింగ్ రంగంలో ప్రైవేటు సంస్థలను ఎక్కువగా ఆహ్వానించడం అత్యంత ప్రమాదకర పరిణామంగా భావిస్తున్న వారు లేకపోలేదు.

ఆర్బీఐ ఇంటర్నల్ గ్రూప్ ఇచ్చిన నివేదికపై చర్చ .. ఎన్నో అనుమానాలు
ఆర్బీఐ ఇంటర్నల్ గ్రూప్ ఇచ్చిన నివేదిక బడా ప్రైవేటు సంస్థలకు అనుమతులు ఇవ్వడంపై ప్రధానంగా నివేదికలో పేర్కొంది . బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 కు అవసరమైన సవరణల తరువాత మాత్రమే పెద్ద కార్పొరేట్ , పారిశ్రామిక సంస్థలను బ్యాంకుల ప్రమోటర్లుగా అనుమతించవచ్చు అని కమిటీ సూచించింది. కానీ అలా అనుమతులు ఇవ్వటం బ్యాంకింగ్ రంగానికి ఏ మేరకు మేలు అనేది మాత్రం ప్రస్తావించలేదు . ఇప్పటికే చాలా బ్యాంకులు మూత పడుతున్న వేళ తాజాగా రిజర్వ్ బ్యాంకు ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ నివేదిక బడా కార్పోరేట్ దిగ్గజాలకు బ్యాంకింగ్ ప్రమోటర్లుగా అవకాశం కల్పించే ఆలోచన చెయ్యటం దేనికి అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.