తెలంగాణ చరిత్రలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి! AWSపై కేటీఆర్ కీలక ప్రకటన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పెట్టుబడులకు సంబంధించి శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తెలంగాణకు గత కొంతకాలంగా భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఐటీ, ఫార్మా రంగ నగరంగా విరాజిల్తున్న భాగ్యనగరాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకు వెళ్లేలా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. తాజాగా అమెజాన్ వెబ్ సిరీస్(AWS) తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు.
గుడ్‌న్యూస్: బ్యాంకు సర్వీస్ ఛార్జీలు పెరగవు.. ఇప్పట్లో పెరగవు కూడా

తెలంగాణ చరిత్రలో అతిపెద్ద ఎఫ్‌డీఐ
అమెజాన్ వెబ్ సిరీస్(AWS) తెలంగాణలోని హైదరాబాద్‌లో రూ.20,761కోట్ల (2.77 బిలియన్ డాలర్లు) భారీ పెట్టుబడితో కొత్త హబ్‌ను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో డేటా కేంద్రాల్ని ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్‌లో 2022 మిడిల్ సమయానికి అమెడాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది.
వరుస సమావేశాల అనంతరం అమెజాన్ వెబ్ సిరీస్ తెలంగాణ చరిత్రలోనే భారీ FDI రానుందని ప్రకటించడం సంతోషంగా ఉందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. AWS క్లౌడ్ హైదరాబాద్ ప్రాంతంలో 2022 ఏడాది మధ్యలో ప్రారంభం కావొచ్చునని పేర్కొన్నారు.
|
హైదరాబాద్‌లో మూడు అవెలబిలిటీ జోన్లు
తన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా ఆసియా పసిఫిక్ హైదరాబాద్ రీజియన్ ఏర్పాటుకు అమెజాన్ నిర్ణయించింది. హైదరాబాదులో మూడు అవెలబిలిటీ జోన్లను ఏర్పాటు చేయనుంది. ప్రతి అవెలబిలిటీ జోన్లో పలు డాటా సెంటర్ల ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత భారత్, ఆస్ట్రేలియా, గ్రేటర్ చైనా, జపాన్, కొరియా, సింగపూర్ వ్యాప్తంగా 9 ఏడబ్ల్యుఎస్ రీజియన్లు, 26 అవెలబిలిటీ కేంద్రాలు జత కానున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు వంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించేందుకు ఇది ఉపయోగపడనుంది. ప్రతి అవలబిలిటీ జోన్ ఇండిపెండెంట్ పవర్, కూలింగ్, ఫిజికల్ సెక్యూరిటీని కలిగి ఉంటుంది.

డేటా సెంటర్ల పెట్టుబడులకు గమ్యస్థానం
తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తర్వాత అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇది. అమెజాన్ భారీ పెట్టుబడిని స్వాగతిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇంత భారీ పెట్టుబడి రావడమంటే తెలంగాణ ప్రభుత్వ విధానాలకు ఉన్న ప్రాధాన్యత అర్థమవుతోందన్నారు. తెలంగాణ పారదర్శక, వేగవంతమైన పరిపాలన విధానాల వల్లనే భారీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. AWSను తన దావోస్ పర్యటన సందర్భంగా కలిసినట్లు తెలిపారు. AWS పెట్టుబడి అనంతరం తెలంగాణ డేటా సెంటర్ల పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతుందన్నారు. ఈ పెట్టుబడి ద్వారా ఇప్పటికే అతిపెద్ద కార్యాలయాన్ని కలిగి ఉన్న అమెజాన్ సంస్థతో తెలంగాణ బంధం మరింత బలోపేతం అవుతుందన్నారు.