Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. 2019లో మందగమనం, 2020లో కరోనా కారణంగా ఆటో పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్నది. ఏప్రిల్ నెలలో అయితే మారుతీ సుజుకీ వంటి దిగ్గజ కంపెనీల సేల్స్ చారిత్రక కనిష్టానికి చేరుకున్నాయి. ఇప్పుడిప్పుడే ఆర్థిక కార్యకలాపాలు కోలుకొని, ఆటో సేల్స్ పుంజుకుంటున్నాయి. ఈ బడ్జెట్లో నిర్మలమ్మ మరింత ఊతమిస్తారని ఆటో పరిశ్రమ భావిస్తోంది.
FY21 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే లాక్‌డౌన్‌తో కొనుగోళ్లు గణనీయంగా పడిపోయాయి. లాక్డౌన్ తర్వాత పరిశ్రమ మెల్లగా కోలుకోవడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ది ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్(FADA) ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచింది. ప్రభుత్వం గత ఏడాది 400 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న కంపెనీలపై 25 శాతం వరకు కార్పోరేట్ పన్నును తగ్గించింది. ఈ ప్రయోజనాన్ని అన్ని రకాల ప్రొప్రైటరీ, భాగస్వామ్య సంస్థలకు కూడా వర్తింప చేయాలని కోరింది. ఆటో మొబైల్ డీలర్‌షిప్‌లో అధిక భాగం వీటి కిందకు వస్తాయి.

గత ఏడాది ఆర్థిక బిల్లులో ప్రభుత్వం ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ కింద ఆటో డీలర్స్ నుండి 0.1 శాతం వసూలు చేయాలని నిర్ణయించగా, ఇది అక్టోబర్ నుండి అమలులోకి వచ్చింది. ఇది రిటైల్ వర్గాలకు భారంగా మారింది. డీలర్స్ రీఫండ్ పొందేవరకు వారి వర్కింగ్ క్యాపిటల్ నిలిచిపోనుంది. అలాగే, పాత వాహనాలను స్వచ్ఛంధంగా తుక్కుగా మార్చి కొత్త వాహనాలు తీసుకునే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరుతోంది. కీలకమైన పన్నుల్లో మినహాయింపులు ఇస్తే ఆటో పరిశ్రమ కోలుకుంటుందని తయారీ కంపెనీలు భావిస్తున్నాయి.
రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ధరల్లో తగ్గింపు కోరుతున్నారు. ఇక సమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, అసెంబ్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు విదేశీ పెట్టుబడులు వచ్చే పాలసీలు ప్రకటించాలని కోరుతున్నారు. బీఎస్6 వాహనాల రాకతో ధరలు పెరిగినందున, జీఎస్టీ తగ్గిస్తే ఉపశమనం ఉంటుందని చెబుతున్నారు. విద్యుత్ కార్లను ప్రోత్సహిస్తుండటంతో లిథియం బ్యాటరీల తయారీదారులు 5 శాతం కస్టమ్ డ్యూటీని తగ్గించాలని కోరుతున్నారు.