అసలు ఎసెన్షియల్ అంటే ఏమిటి?: మహా ప్రభుత్వంపై అంబానీ ఆగ్రహం
మహారాష్ట్రలో లాక్ డౌన్ ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఈ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సోమవారం నుండి మహా ప్రభుత్వం రాత్రి 8 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు లాక్ డౌన్ అమలు చేస్తోంది. మిగతా సమయాల్లోను కఠిన ఆంక్షలు విధించారు. 50 శాతం సామర్థ్యంతో ప్రజా రవాణా వాహనాలకు అనుమతి ఇచ్చారు. ప్రయివేటు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. 50 శాతం సిబ్బందితో ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ పైన అనిల్ అంబానీ తనయుడు అన్మోల్ అంబానీ ఘాటుగా స్పందించారు.

వ్యాపారాలకే ఎందుకు
అనిల్ అంబానీ తనయుడు, రిలయన్స్ క్యాపిటల్ డైరెక్టర్ అన్మోల్ అంబానీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల దృష్ట్యా వ్యాపారాలపై విధించిన ఆంక్షలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నటులు, ప్రొఫెషనల్ క్రికెటర్లు, రాజకీయ నాయకులకు లేని ఆంక్షలు వ్యాపారాలకు ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు. అసలు ఎసెన్షియల్ అర్థం ఏమిటని మహారాష్ట్ర అధికారులపై ధ్వజమెత్తారు.

నటించొచ్చు.. క్రికెట్ ఆడవచ్చు కానీ
ప్రొఫెషనల్ నటులు తమ సినిమాల షూటింగ్ కొనసాగించుకోవచ్చునని, ప్రొఫెషనల్ క్రికెటర్లు అర్థరాత్రి వరకు ఆడుకోవచ్చునని, ప్రొఫెషనల్ రాజకీయ నాయకులు భారీగా జనాలతో ర్యాలీ నిర్వహించవచ్చునని, కానీ వ్యాపారం లేదా పని మాత్రం ఎసెన్షియల్ కాదా అని నిలదీశారు. ఎవరి పని వారికి అత్యవసరమే అంటూ నిప్పులు చెరిగారు.

పెరుగుతున్న కేసులు
కరోనా కేసులు ఇటీవల వేగంగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సినిమా హాల్స్, పార్కులు,, మ్యూజియమ్స్, రెస్టారెంట్లు అన్ని మత ప్రదేశాలను మూసి ఉంచాలని, ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉపయోగించుకోవాలని, రాత్రి సమయంలో సెక్షన్ 144, నైట్ కర్ఫ్యూ ఉంటుందని మహా సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.